అవినీతి కేరాఫ్​ కాంగ్రెస్​ .. రాహుల్​ లీడర్ కాదు.. రీడర్ : కేటీఆర్

మంత్రి కేటీఆర్​ మరోసారి కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ  భవన్​ లో ఏర్పాటు చేసిన వికలాంగుల పెన్షన్ లబ్ధిదారుల కృతజ్ఞత సభలో రాహుల్​గాంధీ, రేవంత్​ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతికి కేరాఫ్​కాంగ్రెస్​ పార్టీ అని ఆరోపించారు మంత్రి కేటీఆర్. కేసీఆర్​లాంటి నాయకుల వల్లే రాష్ట్రంలోని దివ్యాంగులకు ఇవాళ న్యాయం జరిగిందన్నారు. తొమ్మిదిన్నర ఏళ్లల్లో దివ్యాంగుల పెన్షన్ల కోసం ఇప్పటివరకు 10 వేల 300 కోట్లు ఖర్చు చేశామన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 నుంచి 4 శాతం రిజర్వేషన్లు పెంచామన్నారు. అడగకపోయినా దివ్యాంగుల కోసం చాలా పథకాలు ప్రవేశపెడుతున్నామని చెప్పారు. దేశంలోని ఏ రాష్ర్టంలో ఇవ్వని విధంగా దివ్యాంగుల కోసం ప్రతి నెల  4 వేల 16 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. మూడోసారి బీఆర్ఎస్​అధికారంలోకి రాగానే 6 వేల 16 రూపాయలకు పెన్షన్​పెంచుతామన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అతి తక్కువ పింఛన్లు ఇస్తున్నారని చెప్పారు. 

ఇవాళ కాంగ్రెస్, బీజేపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటూ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. అవినీతిపరుడైన రేవంత్​ను పక్కన పెట్టుకుని అవినీతి గురించి రాహుల్​గాంధీ మాట్లాడుతున్నారంటూ సెటైర్ వేశారు. కాంగ్రెస్​ చెప్పే మాటలను ప్రజలెవరూ నమ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్​పార్టీకి 11 సార్లు చాన్స్ ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. కుటుంబ పాలన గురించి రాహుల్​గాంధీ మాట్లాతున్నారంటూ మండిపడ్డారు. రేవంత్​రెడ్డి కాంగ్రెస్​ఎమ్మెల్యే సీట్లను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఓట్ల కోసం కాంగ్రెస్​ నేతలు నానాపాట్లు పడుతున్నారని చెప్పారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో అరిగోసలు పడ్డామన్నారు. కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు లక్షన్నర మంది ఫ్లోరోసిస్​వ్యాధిన పడ్డారని చెప్పారు. తెలంగాణ వచ్చాక ఆ సమస్యను కేసీఆర్ పరిష్కరించారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో సాగు, తాగు నీరు సరిగ్గా ఇచ్చారా...? పెన్షన్లు ఇచ్చారా..? అని ప్రశ్నించారు. 

ఎలక్షన్స్ వస్తుంటాయి.. పోతుంటాయి..బీజేపీ, కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల రాజకీయ నాయకులు కూడా వస్తుంటారు.. వారి మాటలను ఎవరూ నమ్మొద్దన్నారు మంత్రి కేటీఆర్. రాహుల్​గాంధీ లీడర్ కాదు.. రీడర్ అని అన్నారు. ఆయన కాంగ్రెస్​నాయకులు రాసి ఇచ్చే స్క్రిప్ట్​ను చదువుతారని, ఆయనకు రాష్ట్ర పరిస్థితుల గురించి తెలియదని, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరని చెప్పారు. రేవంత్​ కంటే గజదొంగ ఇంకా ఎవరైనా ఉన్నారా...? అని ప్రశ్నించారు. దావూద్ ఇబ్రహీం, చార్లెస్​శోభరాజ్ కూడా రేవంత్​రెడ్డి ముందు చిన్నోళ్లే అని చెప్పారు. అనాడు ఓటుకు నోటు.. ఈనాడు సీటుకు రేటు..రేపు రాష్ట్రమంతా రేవంత్​అమ్ముతాడు అని మాట్లాడారు. రేవంత్​ గురించి అడిగితే కాంగ్రెస్​పార్టీ వాళ్లే  చెబుతారని అన్నారు.

తాము బీజేపీకి బీ టీమ్​ కాదన్నారు. కాంగ్రెస్​వాళ్లే దేశానికి సీ టీమ్ అని మంత్రి కేటీఆర్​అన్నారు. రేవంత్​రెడ్డి.. బీజేపీ కోవర్టు అని ఆరోపించారు. రానున్న ఎలక్షన్స్ లో గెలిచిన కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను రేవంత్​ రెడ్డి తీసుకుని బీజేపీలోకి వెళ్తారని ఆరోపించారు. గాంధీభవన్​ కు గాడ్సేను అప్పగించారని చెప్పారు.