హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 75 వేల ఇండ్ల నిర్మాణం పూర్తయిందని, వాటిలో 4,500 గృహాలను ఇన్ స్టిట్యూట్ లబ్ధిదారులు అందించామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇవాళ ఆయన ప్రగతి భవన్ లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతూ పంపిణీకి సిద్ధంగా ఉన్న 70 వేల ఇండ్లను ఐదు, లేదా ఆరు దశల్లో అందజేస్తామని అన్నారు. వచ్చే వారంలో తొలిదశ ఇండ్ల పంపిణీ ప్రారంభిస్తామని చెప్పారు. ఇందుకోసం ఏర్పాట్లను పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల గుర్తింపులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని పూర్తిగా అధికార యంత్రాంగమే క్షేత్రస్థాయి పరిశీలన కూడా పూర్తిచేసి అర్హులను గుర్తిస్తున్నదని కేటీఆర్ తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం గుర్తించిన లబ్ధిదారులందరినీ పిలిపించి కేటాయించనున్న ఇంటివద్దనే తాళాలు అప్పజెప్పేలా పంపిణీ కార్యక్రమం ఉండాలని సమావేవంలో పాల్గొన్న పలువురు మంత్రులు అధికారులకు సూచించారు. గృహలక్ష్మి పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక, పథకాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లే విషయాన్ని కూడా మంత్రుల సమావేశంలో చర్చించారు.