10 వేల డబుల్‌ బెడ్రూమ్ ఇండ్లు వాళ్లకే : మంత్రి కేటీఆర్‌

10 వేల డబుల్‌ బెడ్రూమ్ ఇండ్లు వాళ్లకే : మంత్రి కేటీఆర్‌

గ్రేటర్ హైదరాబాద్ లో నిర్మించిన 10 వేలకు పైగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను.. మూసీనది ఒడ్డున దుర్భర పరిస్థితుల్లో నివసిస్తున్న పేద ప్రజలకు అందించి, మూసీపై ఆక్రమణలు తొలగించేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. అత్యంత పేదరికం వల్ల మూసీనది పక్కన నివాసం ఉంటున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గొప్ప ఉపశమనం కలిగిస్తాయని చెప్పారు. గురువారం (ఆగస్టు 17న) మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌ నగరం అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.

మూసీ నది వెంట వరదకు అడ్డంకిగా ఉన్న భవన నిర్మాణాలను తొలగిస్తే.. తర్వాత మూసీ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టేందుకు వీలవుతుందన్నారు. ఇప్పటికే మూసీ ప్రాజెక్టు అభివృద్ది కోసం ప్రాథమిక ప్రణాళికను ప్రభుత్వం పూర్తి చేసిందని మంత్రి వివరించారు. తమ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లి, రానున్న ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్టాలని సొంత పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.