నల్గొండ జిల్లాలో ఇంటింటికి నీళ్లిచ్చి ఫ్లోరైడ్ను తరిమికొట్టినం : కేటీఆర్

నల్గొండ జిల్లాలో ఇంటింటికి నీళ్లిచ్చి ఫ్లోరైడ్ను తరిమికొట్టిన ఘనత కేసీఆర్దేనని మంత్రి కేటీఆర్ అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని మన్నెగూడలో నిర్వహించిన ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. 2014 కు ముందు కరెంట్, తాగు, సాగునీటి సమస్య ఉండేదని.. కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వాటిని పరిష్కరించామన్నారు. దేశంలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు. ఆసరా పెన్షన్లతో ఎంతోమందికి అండగా నిలుస్తున్నట్లు చెప్పారు. 

కేసీఆర్ నాయకత్వంలో అన్ని కులవృతులకు పూర్వ వైభవం తెచ్చామని కేటీఆర్ తెలిపారు. కొత్తగా 978 గురుకులాలు పెట్టి.. ఒక్కో విద్యార్థిపై లక్షా 25 వేలు ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రతి ఏటా 110 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉచిత చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామన్న మంత్రి.. ఫిషరీష్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు.

గత ప్రభుత్వాలు కులవృత్తులను పట్టించుకోలే :తలసాని

గత ప్రభుత్వాలు కులవృత్తులను పట్టించుకోలేవని.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కులవృత్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఉద్యమ నాయకుడే సీఎం కావడంతో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు.