ఇది ఢిల్లీ దొరలకు, ప్రజలకు మధ్య పోరాటం: కేటీఆర్

కామారెడ్డి, వెలుగు: ‘‘ఇయ్యాల రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి దొరలకు, ప్రజలకు మధ్య పోరాటమని మాట్లాడుతున్నడు. రాహుల్ చెప్పింది కరెక్టే. ఇది నిజంగా ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటం. ఇందులో మళ్లొక్కసారి తెలంగాణనే గెలుస్తది’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ 
ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు, దోమకొండల్లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాల్లో కేటీఆర్ పాల్గొని, మాట్లాడారు. 

‘‘రాహుల్ గాంధీకి విషయం తెల్వదు.. ఆయన లీడర్ కాదు.. రీడర్. ఏమి రాసిస్తే అది చదువుతడు, తెలుసుకునే అలవాటు కూడా లేదు. ఢిల్లీకి తెలంగాణకు మధ్య జరుగుతున్న పోరాటం కొత్తది కాదు. మీ ముత్తాత జవహర్ లాల్ నెహ్రూ కాలం నుంచే చాలాయ్యింది. తెలంగాణను ఆంధ్రాలో కలుపొద్దని ఆనాడు హైదరాబాద్​ సిటీ కాలేజీ దగ్గర పిల్లలు కొట్లాడితే పోలీసులు ఐదుగురిని కాల్చి చంపిన్రు. కాల్పులు జరిపించిందే నెహ్రూ. ఆంధ్రాకు, తెలంగాణకు బలవంతంగా ఇష్టం లేని లగ్గం చేసిందే కాంగ్రెస్ పార్టీ, నెహ్రు. 1968లో ఉద్యమం చేస్తే 370 మందిని కాల్చి చంపి.. ఉద్యమాన్ని తొక్కింది రాహుల్ నాయినమ్మ ఇందిరమ్మ”అని ధ్వజమెత్తారు.

 2004లో ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని మాట ఇచ్చి పొత్తు పెట్టుకొని వందలాది మందిని రాహుల్ తల్లి సోనియా గాంధీ బలి తీసుకున్నారన్నారు. వందల మంది బలి దానాలతో ఆఖరికి 2014లో తెలంగాణ వచ్చిందన్నారు. ఇష్టం లేని లగ్గం చేసిన పాపం నుంచి విముక్తికి 52 ఏండ్లు పట్టిందన్నారు. ‘‘ఢిల్లీ అహంకారం మాకు కొత్త కాదు. ఢిల్లీతో కొట్లాడుడు కొత్త కాదు. ఆనాడు నెహ్రు, ఇందిరా, సోనియాలతో కొట్లాడినం. ఇయ్యాల ఢిల్లీ దొర మోదీతో కొట్లాడుతున్నం. రాహుల్ గాంధీకి పోరాటం అంటే తెలియదు. ఆయన ఎన్నడు జైలుకు పోయింది లేదు, ఉద్యమం చేసింది లేదు. ఇక్కడ ఉగ్గు పాలతోనే ఉద్యమం నేర్చుకొని రేషమున్న బిడ్డలు ఉన్నారు”అని కేటీఆర్‌‌‌‌ అన్నారు. 

రైతులను బిచ్చగాళ్లని అవమానిస్తారా? 

రైతుల గురించి కాంగ్రెస్ పార్టీ ఏనాడూ ఆలోచించలేదని కేటీఆర్ ఆరోపించారు. రైతులకు తమ ప్రభుత్వం రైతుబంధు ఇస్తుంటే, కేసీఆర్ నీవు బిచ్చమేస్తున్నావా అంటూ రేవంత్​రెడ్డి మాట్లాడుతన్నారని, ఆయనకు రైతులకు ఇస్తున్న రైతుబంధు బిచ్చం లెక్క కొడుతుందని మండిపడ్డారు. రైతులను బిచ్చగాళ్లు అని అవమానించిన కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు గల్లంతయ్యేలా తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరారు. 

ఇక్కడున్న కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు దమ్ములేక.. బక్క పల్చని కేసీఆర్‌‌‌‌ను కొట్టేందుకు ఢిల్లీ నుంచి మోదీ, అమిత్ షా, 16 మంది సీఎంలు, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నేత రాహుల్​గాంధీ, పక్క స్టేట్ సీఎంలు, డిప్యూటీ సీఎంలను తెచ్చుకుంటున్నారని అన్నారు. గంప గోవర్ధన్ చేతిలోనే కామారెడ్డిలో ఎన్నోసార్లు ఓడిపోయిన షబ్బీర్ అలీ.. కేసీఆర్​వస్తే ఇక్కడ తాను గెల్వనని నిజామాబాద్‌‌కు పోయేటట్లు ఉన్నారని కేటీఆర్‌‌‌‌ అన్నారు. గంప గోవర్ధన్ షబ్బీర్ అలీని గంప కింద కమ్మిన్రు.. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కమ్ముతామన్నారు. 

కాగా, కేసీఆర్ పూర్వీకుల గ్రామం అయిన బీబీపేట మండలం కోనాపూర్ గ్రామస్తులు నామినేషన్ కోసం రూ.51 వేల విరాళాన్ని కేటీఆర్‌‌‌‌కు అందించారు. కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నందున ఈ అమౌంట్ ఇచ్చారు. 

ప్రాజెక్టులు ఎలా కట్టాలో కాళేశ్వరం చూసి నేర్చుకో..

హైదరాబాద్, వెలుగు: ‘‘రాహుల్‌‌ గాంధీ.. రేపు కాళేశ్వరం పోతా అన్నవు కదా.. అక్కడికి పోయి చూసి ప్రాజెక్టులు ఎట్టా కట్టాలో తెలుసుకో.. నువ్వు రీడర్‌‌‌‌వు కాదు.. లీడర్‌‌‌‌ అని నిరూపించుకో..”అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం రాత్రి తెలంగాణ భవన్‌‌లో హైదరాబాద్‌‌ కూకట్‌‌పల్లికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత గొట్టెముక్కుల వెంగళరావు తన అనుచరులతో కలిసి బీఆర్‌‌‌‌ఎస్‌‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నోళ్లు ఆ ప్రాజెక్టు చూసి నేర్చుకోవాలన్నారు. 

ఓటుకు నోటు దొంగను పక్కన పెట్టుకొని రాహుల్ గాంధీ అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. చిల్లరగాళ్లకు పదవులిచ్చే రాహుల్ గాంధీ తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్​నాయకత్వంలోనే తెలంగాణ పట్టణాలు, పల్లెలు అభివృద్ధి చెందాయని, మళ్లీ ఆయనే సీఎం కావాలని ప్రజలంతా కోరుతున్నారని తెలిపారు. 

కూకట్​పల్లి ఎమ్మెల్యే అభ్యర్థిని ఈసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వెంగళరావు 40 ఏళ్లకు పైగా కాంగ్రెస్‌‌తో అనుబంధాన్ని వదులుకొని బీఆర్ఎస్‌‌లోకి వచ్చారని, ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కేటీఆర్‌‌‌‌ హామీ ఇచ్చారు.