మిర్యాలగూడను జిల్లా చేస్తాం : కేటీఆర్

    ఆలేరును రెవెన్యూ డివిజన్ చేస్తాం
    టూరిజం పార్క్, ఇండస్ట్రియల్ కారిడార్ తెస్తం
    బీఆర్ఎస్‌‌‌‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

యాదాద్రి, యాదగిరిగుట్ట, మిర్యాలగూడ, వెలుగు : బీఆర్ఎస్‌‌‌‌ను మళ్లీ గెలిపిస్తే మిర్యాలగూడను జిల్లా చేస్తామని, ఆలేరును రెవెన్యూ డివిజన్ చేస్తామని బీఆర్ఎస్‌‌‌‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. సోమవారం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట, వలిగొండ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రోడ్‌‌‌‌ షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  2014కు ముందు ఇప్పుడు మిర్యాలగూడ, ఆలేరు నియోజకవర్గాలు ఎలా ఉన్నాయో ఆలోచన చేయాలని కోరారు. మిర్యాలగూడను జిల్లాగా మారాలన్నా.. రూ. 30 వేల కోట్లతో చేపట్టిన దామరచర్ల మండలంలో యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ ముందుకు పడాలన్నా  భాస్కర్ రావును గెలిపించాలని కోరారు.

పొరపాటున కాంగ్రెస్ నమ్మితే  మళ్లీ మత కలహాలు, కర్ఫ్యూలు, కరెంట్ లేని చీకటి రోజులు వస్తాయని హెచ్చరించారు. రాష్ట్రంలో కరెంట్ లేదని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు  దమ్ముంటే మిర్యాలగూడలోని ఏ సబ్ స్టేషన్ కైనా వెళ్లి తీగల పట్టుకోవాలని  సూచించారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి,  నాయకులు అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి, డీసీఎంఎస్  చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, ఎన్ బీ ఫౌండేషన్ చైర్మన్, యువనేత నల్లమోతు సిద్ధార్థ, చైతన్య, కోఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, దినేశ్ పాల్గొన్నారు.

ఆలేరుపై వరాలు

యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంపై కేటీఆర్​ వరాలు కురిపించారు. ఆలేరును రెవెన్యూ డివిజన్ చేస్తామని,  రఘునాథపురం, మాదాపూర్ మండలాలుగా మారుస్తమని  ప్రకటించారు. దాతరుపల్లిలో 55 ఎకరాల విస్తీర్ణంలో టూరిజం పార్క్ డెవలప్ చేయడంతో పాటు తుర్కపల్లిలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. యాదగిరిగుట్టలో మాదిరిగా ఆలేరులో 100 పడకల హాస్పిటల్ నిర్మిస్తమని హామీ ఇచ్చారు. ఆలేరును ఇండస్ట్రియల్ కారిడార్ కు అనుసంధానం చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని  హామీ ఇచ్చారు.  

యావత్ ప్రపంచం మొత్తం యాదగిరిగుట్ట వైపు చూసేలా టెంపుల్‌‌‌‌న పునర్నిర్మించామని, 2014 కు ముందు యాదగిరిగుట్ట ఆలయం ఎట్లుండే, ఇప్పుడెట్లుందో చూస్తే  ఏం అభివృద్ధి జరిగిందో అర్థమైతుందన్నారు.  గుట్ట అభివృద్ధి కారణంగా కొందరికి నష్టం జరిగింది వాస్తవమేనన్నారు.  సీఎం కేసీఆర్ తో మాట్లాడి కొండపైకి ఆటోలను అనుమతించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.  

గొంగిడి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రోడ్​ షోలో జడ్పీ చైర్మన్​ ఎలిమినేటి సందీప్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్​రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కల్లూరి రాంచంద్రారెడ్డి, సూదగాని హరిశంకర్​ గౌడ్​ ఉన్నారు.