హైదరాబాద్ లో జ్యోతిబా పూలే విగ్రహం పెట్టిస్తాం: కేటీఆర్

  • బీసీ సంఘం ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ 
  • రాష్ట్ర బీసీ సంఘ ప్రతినిధులతో కేటీఆర్ భేటీ

హైదరాబాద్: మహాత్మ జ్యోతిబా పూలే విగ్రహాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం చేసిన ప్రతిపాదనకు మంత్రి కేటీఆర్ అంగీకరించారు. జ్యోతిబాపూలే కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని, ఇందుకు సంబంధించి అవసరమైన అన్ని ఖర్చులను  ప్రభుత్వమే భరిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ ప్రతినిధులు కేటీఆర్ తో సమావేశమయ్యారు. బీసీల అభివృద్ధి కోసం ఇచ్చిన సలహాలు, సూచనల పైన మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని బీసీ సంఘం నేతలు  తెలిపారు. 

దేశంలో ఎక్కడా లేని పథకాలు: జాజుల శ్రీనివాస్ గౌడ్

దేశంలో ఎక్కడా లేనివిధంగా బలహీనవర్గాల కోసం అనేక కార్యక్రమాలను రాష్ట్ర  ప్రభుత్వం చేపట్టిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కేవలం సంక్షేమ కార్యక్రమాలతోనే సరిపెట్టకుండా బలహీనవర్గాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర రాజధానిలో స్థలం, భవన నిర్మాణాలకు అవసరమైన నిధులను ఇచ్చిందన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తమ సంఘం పనిచేస్తుందని, టీఆర్ఎస్  ప్రభుత్వ కార్యక్రమాలను తప్పకుండా అభినందిస్తామని పేర్కొన్నారు. బీసీల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.  నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  పేరు పెట్టడం చాలా అభినందనీయమని, చారిత్రాత్మకమని  తెలిపారు.