హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో వానకాలం పరిస్థితులు, వాటిని ఎదుర్కొవడంపై మంత్రి కేటీఆర్ రివ్యూ చేశారు. మంగళవారం సెక్రటేరియెట్లో నిర్వహించిన ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తోపాటు జలమండలి ఎండీ దానకిశోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ వర్షాకాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ప్రాణనష్టం జరగకుండా చూడడమే అధికారుల ఫస్ట్ప్రయారిటీగా ఉండాలని సూచించారు. గ్రేటర్ లో భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని చేపట్టాల్సిన పనులపై చర్చించారు. జీహెచ్ఎంసీ చేపట్టిన ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. మెజార్టీ పనులు పూర్తయ్యాయని, గతేడాదితో పోలిస్తే వరద ప్రమాదం అనేక కాలనీలకు తప్పుతుందని ఎస్ఎన్డీపీ విభాగం అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాలలో అవసరమైన డీవాటరింగ్ పంపులు, ఇతర ఏర్పాట్లను చేసుకుని సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. సిటీలో ప్రారంభించిన వార్డు ఆఫీసుల పనితీరుపై చర్చించారు.
ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వార్డు ఆఫీసు వ్యవస్థను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఈ వ్యవస్థను సిటీ ప్రజలు విస్తృతంగా వినియోగించుకునేలా ప్రయత్నాలు చేయాలన్నారు. ఈ వ్యవస్థను మరింతగా మెరుగుపరిచేందుకు ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టీమ్ఏర్పాటు చేసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కేటీఆర్ పలువురు సిటీ ప్రజలతో ఫోన్లో మాట్లాడారు. జీహెచ్ఎంసీకి వివిధ సమస్యలపైన ఫిర్యాదు చేసిన వారికి, ఆయా సమస్యలు పరిష్కారమైన తీరు, అధికారుల నుంచి ఎదురైన అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ తోపాటు, జలమండలి చేపట్టిన ప్రాజెక్టులు, ఉచిత నీటి సరఫరా, ఫిర్యాదుల పరిష్కారం వంటి కార్యక్రమాలపై కేటీఆర్ సమీక్షించారు.