- బీజేపీ వాళ్లు ఓటుకు తులం బంగారం ఇస్తరట..తీసుకొని టీఆర్ఎస్ నే గెలిపించండి
- 14 నెలల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా
- రోడ్ షోలో మంత్రి కేటీఆర్
యాదాద్రి, వెలుగు: 'మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని రూ. 18 వేల కోట్లకు గుజరాత్ పెద్దలైన గద్దలకు రాజగోపాల్‌రెడ్డి తాకట్టు పెట్టాడు. ఓటుకు తులం బంగారం ఇస్తడట. ఆ సొమ్ము గుజరాత్ దొంగల సొమ్ము.. బరాబర్‌గా దబాయించి తీసుకోండిం. కారు గుర్తుకే ఓటెయ్యండి. టీఆర్ఎస్ను గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకొని 14 నెలల్లో అభివృద్ధి చేస్తా” అని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలో రోడ్ షో నిర్వహించి మాట్లాడారు. 2018లో పొరపాటున రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే.. ఏనాడు నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయలేదని, కాంగ్రెస్ గుర్తుపై గెలిచి బీజేపీ పాట పాడి వేల కోట్ల కాంట్రాక్టులు దక్కించుకుని ఆర్థికంగా లబ్ధిపొందాడన్నారు. కానీ, టీఆర్ఎస్ మాత్రం నాలుగేండ్ల నుంచి మునుగోడులో అభివృద్ధి ఆపలేదన్నారు. దండు మల్కాపురంలో 500 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేశామని, ఇందులో దాదాపుగా 200 కంపెనీలు పరిశ్రమలు ఏర్పాటు చేశామన్నారు. విదేశాల్లో దాచుకున్న నల్లడబ్బును కక్కిస్తానని ప్రగల్భాలు పలికిన మోడీ.. అధికారంలోకి వచ్చాక తెల్లముఖం వేశారని కేటీఆర్ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథ కోసం రూ.19 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేస్తే ఇవ్వని ప్రధాని..రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నిక తెచ్చినందుకు రాజగోపాల్ రెడ్డికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చాడన్నారు. కేంద్రంలో బీజేపీని గెలిపిస్తే ఒక్కొక్కరి అకౌంట్ లో రూ.15 లక్షలు వేస్తానన్న మోడీ.. మునుగోడు ఉప ఎన్నిక తెచ్చినందుకు రాజగోపాల్ రెడ్డి అకౌంట్ లో వేశారన్నారు. మునుగోడు ఎన్నికల్లో కారు ఒకవైపు, బేకార్‌గాళ్లు, బేకార్ మాటలు మాట్లాడే వాళ్లు మరోవైపు ఉన్నారన్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ ఎంత స్మార్ట్‌గా ఉంటారో.. చౌటుప్పల్ మున్సిపాలిటీని అంత స్మార్ట్‌గా చేస్తామని అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, సీపీఐ, సీపీఎం నేతలు ఉన్నారు.
గంటపాటు హైవే బ్లాక్
హైదరాబాద్–విజయవాడ హైవేపై రోడ్ షో కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్అయ్యింది. దీంతో 8 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైవేను బ్లాక్ చేసిన ట్రాఫిక్ పోలీసులు, వాహనాలను చిట్యాల నుంచి భువనగిరి మీదుగా హైదరాబాద్ వైపుకు వెళ్లేలా చేశారు. ట్రాఫిక్ జామ్‌లో ఓ అంబులెన్స్ కూడా చిక్కుకుంది. ప్రచారానికి వెళ్తున్న బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్బండి సంజయ్ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. రోడ్ షో రాత్రి 8.05 గంటలకు ముగియగా, ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పోలీసులకు గంటకు పైగా టైం పట్టింది.