
- బీఆర్ఎస్లో చేరిన రాకేశ్‌రెడ్డి, మాదాసు వెంకటేశ్, బక్క నాగరాజు
హైదరాబాద్, వెలుగు: వరంగల్‌లో నియో మెట్రో పరుగులు పెట్టిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్‌కు పలు ఐటీ కంపెనీ లను తెచ్చామని, మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఏమైనా సమస్యలుంటే పరిష్కరిస్తామన్నారు. శనివారం తెలంగాణ భవన్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీజేపీ నేతలు ఏనుగుల రాకేశ్‌రెడ్డి,మాదాసు వెంకటేశ్, బక్కనాగరాజు యాదవ్ బీఆర్ఎస్లో చేరారు.వారికి కేటీఆర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్‌పార్టీ కనీసం కరెంట్, నీళ్లు కూడా ఇవ్వలేదన్నారు. మన తెలంగాణను మనమే పాలించుకుందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఏం చేయాలన్నా ఢిల్లీకి పోవాల్సిందేనని, మన హైకమాండ్ రాష్ట్రంలోని ప్రజలేనని తెలిపారు. పార్టీలో చేరిన నేతలంతా బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాలన్నారు.
కేసీఆర్ పాలనలో సురక్షితంగా ఉన్నామని ఆడబిడ్డలు చెబుతున్నారని తెలిపారు. దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణను నంబర్‌వన్‌గా నిలిపామని, అనేక ప్రపంచ స్థాయి కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నాయని.. ప్రగతిని ఇలాగే కొనసాగించుకుందామని కోరారు.
బీఆర్ఎస్ అధికారం కోసం కృషి: రాకేశ్‌రెడ్డి
రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ..కేసీఆర్ తెలంగాణవాదానికి రూపురేఖలు ఇచ్చిన నాయకుడని, ఆయన పిలుపుతో తెలంగాణ మొత్తం ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిం చిందన్నారు. మంత్రి కేటీఆర్ మంచి విజన్‌తో ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని, ఆయన తెలంగాణ భవిష్యత్ నిర్మాత అని అన్నారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్తదితరులు పాల్గొన్నారు.