అబద్ధాల బీజేపీకి గుణపాఠం తప్పదు: కేటీఆర్

  • ఆదిలాబాద్ సభలో అమిత్ షా చెప్పినవన్నీ అబద్ధాలే
  • బీఆర్ఎస్ స్టీరింగ్ ముమ్మాటికీ మా చేతుల్లోనే ఉంది
  • బీజేపీ స్టీరింగ్​ మాత్రం అదానీ చేతుల్లో ఉందని ఫైర్

హైదరాబాద్, వెలుగు: అబద్ధాల బీజేపీకి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని బీఆర్ఎస్​వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్​షా మరోసారి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మంగళవారం ‘ఏఎన్ఐ’ వార్త సంస్థతో ఆయన మాట్లాడుతూ.. ‘‘బీజేపీ ఎన్ని అబద్ధాలు చెప్పినా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయం. 

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చేయలేదు. అయినా అమిత్​షా అడ్డగోలుగా మాట్లాడటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎన్నికలప్పుడు బీజేపీ చెప్పే జుమ్లా, అబద్ధాలు విని దేశ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. దేశంలో పెరిగిన ధరలు, నిరుద్యోగం గురించి అమిత్​షా మాట్లాడితే మంచిది. 

ఆయనకు దమ్ముంటే అదానీ గురించి మాట్లాడాలి” అని చెప్పారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్​షా ఒకే అబద్ధాన్ని వందసార్లు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలతో రైతుల కోసం పాటుపడుతున్న తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారని, రైతుబంధు దేశానికే స్ఫూర్తిగా నిలిచిందని చెప్పారు. ఈ స్కీమ్‌‌‌‌ను ప్రధాని మోదీ కాపీ కొట్టారని ఆరోపించారు.

సవాల్‌‌‌‌కు సిద్ధమా?

‘‘ఐదేండ్ల కిందట ఆదిలాబాద్​జిల్లాకు వచ్చిన అమిత్​షా.. మూతపడిన సిమెంట్​కార్పొరేషన్​ఆఫ్​ఇండియాను తెరిపిస్తామని హామీ ఇచ్చారు. అయినా దానిపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇలాంటి నాయకులు కేంద్రంలో ఉండటం రాష్ట్రానికి దురదృష్టం. తెలంగాణ వచ్చి పదేండ్లవుతున్నా చట్ట ప్రకారం ఒక్క విద్యాసంస్థను కూడా కేంద్రం కేటాయించలేదు. 

ప్రతి జిల్లాకు ఒక నవోదయ, మెడికల్​కాలేజీలు, యూనివర్సిటీలు సహా ఏ ఒక్క విద్యాసంస్థను ఇవ్వలేదు. పైగా తెలంగాణ ప్రభుత్వంపైనే ఆరోపణలు చేయడం సరికాదు” అని కేటీఆర్ మండిపడ్డారు. ఏండ్ల కిందటే ట్రైబల్​వర్సిటీకి స్థలమిచ్చినా ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏది తెలంగాణ కన్నా గొప్పగా అభివృద్ధి చెందిందో చెప్పాలి. రాష్ట్ర స్థూల ఆదాయం, తలసరి ఆదాయం, మానవాభివృద్ధి సూచీల్లో అన్ని రంగాల్లో తెలంగాణ సమగ్రాభివృద్ధి చెందింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ ఒక్కటైనా తెలంగాణతో పోటీ పడుతుందా? దీనిపై నా సవాల్‌‌‌‌ను ​స్వీకరించేందుకు సిద్ధమా?” అని ప్రశ్నించారు.

జై షా ఎక్కడ క్రికెట్​ ఆడారు?

కుటుంబ పాలన గురించి అమిత్​షా మాట్లాడితే దేశ ప్రజలంతా నవ్వుకుంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘‘అమిత్​షా కొడుకు జై షా ఎక్కడ క్రికెట్​ ఆడారు? ఆయన ఎలా బీసీసీఐ సెక్రటరీ అయ్యారో చెప్పాలి. ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికవుతున్న వారి గురించి కుటుంబ పాలన అని విమర్శించే హక్కు అమిత్​షా లాంటి వారికి లేదు” అని కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ స్టీరింగ్ ముమ్మాటికీ తమ చేతుల్లోనే ఉందని.. బీజేపీ స్టీరింగ్​ మాత్రం అదానీ చేతుల్లో ఉందన్న విషయం గుర్తిస్తే మంచిదని హితవు పలికారు. 

సెప్టెంబర్​17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన విషయం అమిత్​షాకు చెప్పకుండా కిషన్​రెడ్డి దాచి పెట్టారేమోనని సెటైర్లు వేశారు. ఈ విషయంలో తన వ్యాఖ్యలను అమిత్​షా సరిదిద్దుకోవాలని చెప్పారు. అమిత్​షాకు దమ్ముంటే పదేండ్లలో తెలంగాణకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలని సవాల్​విసిరారు. ఏం చేయలేదు కాబట్టే మత రాజకీయాలు చేసి ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పి తీరుతారన్నారు.