నరేంద్రమోడీ దేశానికా..? లేక కర్నాటక రాష్ట్రానికి ప్రధానమంత్రా..? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా.. మూడు సిలిండర్లు ఫ్రీ ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొన్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయం పేద ప్రజల కోసం ఉంటుందన్నారు. అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోయారని, సీఎం కేసీఆర్ స్వయంగా పంట పొలాలను పరిశీలించారని చెప్పారు. రాళ్ల వాన కారణంగా వరి ధాన్యం తడిసిపోయిందని, నష్టపోయిన పంట పొలాలను తాను కూడా స్వయంగా పరిశీలించానని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో నీళ్లు ఎక్కువగా ఉండడం వల్ల రైతులు వరి పోలాలు సాగు చేశారని మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అంటే రైతు ప్రభుత్వం అని చెప్పారు. సిరిసిల్ల జిల్లాలో 13 మండలాల్లో 19 వేల ఎకరాలలో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి రైతు నమ్మకంగా ఉండాలన్నారు. సివిల్ సప్లై ద్వారా 7 1/2 లక్షల టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామన్నారు. గతం కంటే ఈసారి ఎక్కువగా వరి ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రాష్ట్రంలో రైతులెవరూ ఆందోళన చెందవదన్నారు.