- ప్రవళిక తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగమిస్తం
- కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే 50 ఏండ్లు వెనక్కి పోవుడే
- కేసీఆర్ చేసినన్ని యాగాలు.. మోదీ కూడా చెయ్యలే
- గంగుల మీద పోటీ అంటే.. పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేసినట్టే
- రేవంత్ రెడ్డి.. థర్డ్ క్లాస్ క్రిమినల్ అని కామెంట్
కరీంనగర్, వెలుగు: తొమ్మిదేండ్లలో 2 లక్షల 20 వేల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టామని, అందులో లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మిగతా ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని చెప్పారు. ‘‘జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. తప్పకుండా ఏ ఏడాదికి ఆ ఏడాది టీఎస్ పీఎస్సీ ద్వారానే ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అవసరమైతే ఆ బోర్డును కూడా ప్రక్షాళన చేసి యువతకు న్యాయం చేస్తాం” అని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ సర్కార్ పై నమ్మకం ఉంచి, మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే మళ్లీ 50 ఏండ్లు వెనక్కి వెళ్తామని హెచ్చరించారు. కరీంనగర్ సిటీలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బుధవారం నిర్వహించిన కరీంనగర్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రవళిక చావుపై కొందరు చిల్లర రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘‘ఈ రోజు ఉదయం ప్రవళిక తల్లి, తండ్రి, తమ్ముడితో మాట్లాడాను. వాళ్లు న్యాయం చేయాలని కోరారు. బాధపడవద్దని, కుటుంబానికి అండగా ఉంటామని, న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చాను. ప్రవళిక తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తామని, కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చాను” అని తెలిపారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు బీజేపీ వాళ్లు వస్తారని.. వాళ్లు రెచ్చగొడితే రెచ్చిపోవద్దని యువతను కోరారు.
కరీంనగర్ గడ్డ మీదనే తెలంగాణ ఏర్పాటుకు బీజం..
తెలంగాణ ఏర్పాటుకు బీజం పడింది కరీంనగర్ గడ్డ మీదనేనని కేటీఆర్ గుర్తు చేశారు. ‘‘ఇక్కడే కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభమైతే, అల్గునూరు చౌరస్తాలో అరెస్టయితే.. ఆ రోజు అగ్గి అంటుకుంది. 2009 నవంబర్ 29న అగ్గి రాజుకుంది. మళ్లీ 14 ఏండ్ల తర్వాత నవంబర్ 30న అగ్గి పెడితే.. ఆ అగ్ని కీలల్లో కాంగ్రెస్, బీజేపీ దహించుకుపోవాలి” అని అన్నారు. ‘‘తెలంగాణ ఏర్పాటు తర్వాత సాగు, తాగు నీరు వచ్చాయి. రోడ్లు, డ్రైనేజీలు బాగయ్యాయి. ఎక్కడో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఎత్తి పోసి, 618 మీటర్ల ఎత్తులోకి నీళ్లను తీసుకెళ్లిన అపర భగీరథుడు కేసీఆర్. ఒకప్పుడు రూ.200 పెన్షన్ తీసుకున్న అవ్వ.. ఇప్పుడు రూ.3 వేలు తీసుకుంటోంది.
మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే రూ.5 వేల పెన్షన్ ఇస్తాం. ఒకప్పుడు ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు నాలుగు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. బడుగు, బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీల కోసం వెయ్యిన్నొక్క గురుకుల పాఠశాలలు పెట్టిన రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమే” అని చెప్పారు. ‘‘చావు నోట్లో తల పెట్టి తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్ ఒక దిక్కు ఉన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చెయ్యిమంటే పారిపోయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. ఓటుకు నోటుకు దొంగ, థర్డ్ క్లాస్ క్రిమినల్ రేవంత్ రెడ్డి మరో దిక్కు ఉన్నారు. మీరు వేసే ఓటు గంగులను గెలిపించడమే కాదు.. కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తదని గుర్తు పెట్టుకోవాలి. కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే ఢిల్లీకి, గుజరాత్ కు ఉపయోగపడతాయి” అని హెచ్చరించారు.
బండి సంజయ్.. బడి తేలే, గుడి తేలే
మతం పేరిట చిచ్చు పెట్టే సన్నాసులు ఇదే కరీంనగర్ నుంచి కొందరు వచ్చారని కేటీఆర్ మండిపడ్డారు. ‘‘ఆ రోజు కమలాకరన్న చేతిలో ఎమ్మెల్యేగా ఓడిపోయి.. ఏడ్చి ఏడ్చి ఇక్కడ ఒకాయన ఎంపీగా గెలిచిండు. ఆనాడు అందరినీ మోసం చేసి.. హిందువని, ముస్లిం అని లేని పంచాయతీ పెట్టి ఎంపీ అయిండు. ఎంపీ అయినప్పటి నుంచి ఏం పని చేసిండు. కరీంనగర్ పార్లమెంట్ కు గానీ, కరీంనగర్ పట్టణానికి గానీ ఒక్క పైసా పని చేసిండా? ఒక కొత్త స్కూల్, ఐఐటీ, కేజీబీవీ, ఇంజనీరింగ్ కాలేజీ లాంటి విద్యాసంస్థలు తెచ్చిండా?’’ అని ప్రశ్నించారు.
బడి తేకపోతే గుడి అయినా తెచ్చిండా అంటే.. అదీ తేలేదన్నారు. లాస్ట్ టైమ్ మోసమైందని.. ఈసారి గంగులనే కాదు వినోద్ ను కూడా ఎంపీగా గెలిపించాలని కోరారు. ‘‘కేసీఆర్ హిందువు. కేసీఆర్ పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు చేశారు. మోదీ కూడా అంత పెద్ద యాగాలు చేయలేదు. కేసీఆర్ ఎప్పుడూ మతాన్ని రాజకీయాలకు వాడుకోలేదు” అని అన్నారు. బీఆర్ఎస్ కరీంనగర్ సిటీ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావు మాట్లాడారు. జెడ్పీ చైర్ పర్సన్ విజయ తదితరులు పాల్గొన్నారు.
గంగుల మీద పోటీకి భయపడుతున్నరు..
కరీంనగర్ లో మంత్రి గంగుల మీద పోటీ చేయడమంటే.. పోచమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టేనని కేటీఆర్ అన్నారు. అందుకే గంగుల మీద పోటీ చేయడానికి బీఫామ్ ఇస్తామంటే కూడా కాంగ్రెస్, బీజేపీ నాయకులు భయపడి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. ‘‘ఒకాయన ఇప్పటికే హుస్నాబాద్ పోయిండు. బీజేపీ వాళ్లయితే ఎల్ బీనగర్ లో పోటీ చేయాల్నా, వేములవాడలో పోటీ చేయాల్నా అని ఇంకా ఆలోచిస్తున్నారట. వాళ్లకు కరీంనగర్ లో పోటీ చేసే దమ్ము లేదు” అని విమర్శించారు.
కేసీఆర్‌కు సరితూగే నాయకుడు రాష్ట్రంలో లేడు: గంగుల
కౌన్సిలర్ గా, కార్పొరేటర్ గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా... ఇలా ఏ పదవిలో ఉన్నా ప్రజల మధ్యనే ఉన్నానని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. వరుసగా మూడుసార్లు గెలిపించిన కరీంనగర్ ప్రజలు.. నాలుగోసారీ ఆశీర్వదించాలని కోరారు. ‘‘నా కంటే ముందు అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులుగా పని చేసినా కరీంనగర్ లో అభివృద్ధి ఏమీ చేయలేదు.
ఉమ్మడి రాష్ట్ర పాలనలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని రోడ్ల కోసం రూ.కోటి అడిగితే ఇవ్వలేదు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ ను అడిగితే మారుమాట్లాకుండా రూ.300 కోట్లు ఇచ్చారు. ఆంధ్రా నాయకులు బీజేపీ, కాంగ్రెస్ ముసుగు వేసుకుని వస్తున్నారు. వారికి ఓటేస్తే మళ్లీ ఆంధ్రా, తెలంగాణను కలిపేస్తారు. మళ్లీ 58 ఏండ్లు వెనక్కి వెళ్తాం” అని హెచ్చరించారు. కేసీఆర్ కు సరితూగే నాయకుడే లేడన్నారు. తెలంగాణను ఢిల్లీ పాలకుల చేతుల్లో పెడితే మన బిడ్డల భవిష్యత్ ఆగమవుతుందన్నారు.
ప్రవళిక కుటుంబానికి అండగా ఉంటం: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి ప్రవళిక కుటుంబానికి అండగా నిలుస్తామని, ఆమె తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగమిస్తామని మంత్రి కేటీఆర్భరోసానిచ్చారు. వరంగల్జిల్లా బిక్కాజిపల్లికి చెందిన ప్రవళిక కుటుంబ సభ్యులు బుధవారం బేగంపేట క్యాంపు ఆఫీస్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. తమ కుమార్తె ఆత్మహత్య గురించి ఆమె తల్లిదండ్రులు మంత్రికి వివరాలు చెప్పారు. ప్రవళికను వేధించి ఆత్మహత్యకు కారకుడైన శివరామ్‌ను కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు.
వారిని ఓదార్చిన మంత్రి కేటీఆర్మాట్లాడుతూ, ప్రవళిక మరణం దురదృష్టకరమన్నారు. ఇలాంటి కష్టమైన సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. ప్రవళిక ఆత్మహత్య గురించి డీజీపీ అంజనీ కుమార్‌తో ఫోన్లో మాట్లాడారు. వేగంగా విచారణ పూర్తి చేసి నిందితుడికి శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. ప్రవళిక మృతికి కారణమైన వ్యక్తికి శిక్ష పడేలా చూస్తామన్నారు. ఆమె కుటుంబానికి అన్నివిధాల అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.