ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిపై మంత్రుల సమీక్ష
మునుగోడు ఉప ఎన్నిక ముందు తమ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల లోపే అన్ని హామీలను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లోనూ రాబోయే 6, 7 నెలల్లో అన్ని హామీలు నెరవేరుస్తామన్నారు. ఉప ఎన్నిక ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలు తీరుపై చర్చించేందుకు ఐదుగురు రాష్ట్ర మంత్రులు ఇవాళ మునుగోడు నియోజకవర్గానికి వెళ్లారు. మంత్రుల వెంట ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఒక నియోజకవర్గం అభివృద్ధి కోసం ఐదుగురు మంత్రులు మునుగోడుకు రావడం అరుదైన సందర్భం అని మంత్రి కేటీఆర్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 స్థానాల్లోనూ టీఆర్ఎస్ జెండా ఎగురవేశామని చెప్పారు. ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పేందుకే తామంతా వచ్చామన్నారు. మునుగోడ ఉప ఎన్నిక ముందు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చే బాధ్యత తమపై సమిష్టిగా ఉందన్నారు. రాష్ట్రంలో రాబోయే10, 12 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయని, ఆలోపే అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నామని స్పష్టం చేశారు.
గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీకి కూడా లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికే దిక్సూచిగా నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు ప్రారంభించామని చెప్పారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామెరచర్లలో 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. భవిష్యత్తు అవసరాల కోసం ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.
ఇవాళ భారతదేశంలోనే అత్యధికంగా వరి ధాన్యం పండిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ 2వ స్థానంలో ఉందని, జిల్లాల పరంగా చూస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా మొదటిస్థానంలో ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో రాష్ట్రంలో వరి సాగు విస్తరణ బాగా పెరిగిందన్నారు. ఇవాళ యాదాద్రికి ప్రతిరోజూ 80 వేల మందికి పైగా భక్తులు వస్తున్నారని, కోటి రూపాయల ఆదాయం వస్తుందని, ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతే అన్నారు. దండు మల్కాపురంలో 542 ఎకరాల్లో అతిపెద్ద పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేశామని, దీని ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం ప్రారంభించామన్నారు. ఇది కూడా పూర్తి కావొచ్చిందని, త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు.
మునుగోడు నియోజకవర్గానికి ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్పేందుకే ఉప ఎన్నిక ఫలితం వచ్చిన నెల రోజుల లోపే తామంతా వచ్చామని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాబోయే 10, 12 నెలల్లోపు అన్ని హామీలను పూర్తి చేస్తామన్నారు.
* ఉమ్మడి నల్గొండ జిల్లాలో రోడ్ల నిర్మాణాలు, పునరుద్ధరణ కోసం రాబోయే 6, 7 నెలల్లో రూ.402 కోట్ల నిధులను ఖర్చు చేస్తామని చెప్పారు.
* పంచాయతీ రాజ్ శాఖ ద్వారా.. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు, రహదారులు నిర్మించేందుకు రూ.700 కోట్లు ఖర్చు చేస్తామన్నారు.
* మున్సిపల్ శాఖ ద్వారా.. రూ. 334 కోట్లు ఖర్చు చేయబోతున్నామని చెప్పారు.
* గిరిజన సంక్షేమ శాఖ ద్వారా.. రూ.100 కోట్లతో వివిధ తండాల్లో రహదారుల నిర్మాణం కోసం ఖర్చు చేస్తామన్నారు. రాబోయే 6, 7 నెలల్లోపు రూ.1544 కోట్ల నిధులను 12 నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేస్తామని చెప్పారు.
మునుగోడు నియోజకవర్గానికి వరాల జల్లు
* మునుగోడులో రూ.100 కోట్ల ఖర్చుతో రోడ్ల మరమ్మతులు చేపడుతామని మంత్రి కేటీఆర్ చెప్పారు. పంచాయితీరాజ్ శాఖ నుంచి రూ.175 కోట్లు, మున్సిపల్ శాఖ నుంచి మొత్తం రూ.80 కోట్లు (చండూరు మున్సిపాలిటీకి రూ.30 కోట్లు, చౌటుప్పల్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు) ఖర్చు చేస్తామని చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖ నుంచి గిరిజన తండాల అభివృద్ధికి రూ.25 కోట్లు, రూ.8 కోట్లతో 5 కొత్త 33/11 కేవీ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు.
* సీఎం కేసీఆర్ హామీ ప్రకారం.. చండూరును రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామన్నారు. మునుగోడు నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామన్నారు.
* దండు మల్కాపురంలో 100 ఎకరాల్లో 10 వేల మందికి ఉపాధి కల్పించేలా టాయ్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. త్వరలోనే భూమి పూజా చేస్తామన్నారు.
* సంస్థాన్ నారాయణపూర్ లో గిరిజనుల కసం సేవాలాల్ బంజారా భవన్, గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
* నేతన్నలకు మాట ఇచ్చినట్టుగానే చేనేత జౌళిశాఖ తరపున కొత్తగా నాలుగు హ్యాండ్లూమ్ క్లస్టర్స్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామన్నారు.
ఎన్నికల ముందు ఒక మాట.. ఎన్నికల తర్వాత ఒక మాట తమ సిద్ధాంతం కాదని, ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటను నిలబెట్టుకోవడం కోసం ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మునుగోడులో టీఆర్ఎస్ ను గెలిపించిన ఓటర్లకు మరోసారి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.