ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ
హైదరాబాద్, వెలుగు : దేశ ప్రజలపై హిందీని రుద్దొద్దని, ప్రపంచ స్థాయి విద్యాసంస్థల్లో హిందీ మీడియంలో మాత్రమే బోధన ఉండాలని అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన నివేదిక సరికాదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నిర్ణయాలను ఉప సంహరించుకోవాలని కోరుతూ బుధవారం మోడీకి ఆయన లేఖ రాశారు. ఐఐటీ, ఎన్‌ఐటీ లాంటి విద్యాసంస్థల్లో ఇంగ్లిష్‌లో కాకుండా హిందీ మీడియంలో చదివితే ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో మన దేశ యువత వెనుకబడతారన్నారు.
‘‘దేశంలో 40శాతం మంది ప్రజలు మాట్లాడే హిందీని అందరికీ అంటగట్టడం దుర్మార్గం. రాజ్యాంగం ఏ భాషకూ అధికారిక హోదా ఇవ్వలేదు. హిందీకి రాజభాష అని పట్టం కట్టలేదు. దేశంలో 22 భాషలను రాజ్యాంగం అధికారిక భాష లుగా గుర్తించింది. అలాంటప్పుడు మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం. కమిటీ నివేదికను పక్కన పెట్టాలి” అని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షలు హిందీ, ఇంగ్లిష్‌లోనే నిర్వహించాలనే నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని కేటీఆర్ అన్నారు.
‘కూసుకుంట్ల’ నామినేషన్‌కు కేటీఆర్
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. చండూరు తహసీల్దార్ ఆఫీస్‌లో ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు టీఆర్‌ఎస్ కార్యకర్తలు, సీపీఐ, సీపీఎం నాయకులు పాల్గొననున్నారు. నామినేషన్‌కు ముందు చండూరులో భారీ ర్యాలీకి టీఆర్ఎస్ ప్లాన్ చేసింది.