హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను రాత్రికిరాత్రే విశ్వనగరం చేయలేం

హైదరాబాద్, వెలుగు: రాత్రికి రాత్రే హైదరాబాద్ ను విశ్వనగరం చేయలేమని, సిటీని డెవలప్​చేసేందుకు ఏడేండ్లుగా మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి కేటీఆర్​అన్నారు. న్యూయార్క్ లాంటి నగరమే భారీ వానలతో నీట మునిగిందని పేర్కొన్నారు. హైదరాబాద్ సీవరేజీ మాస్టర్ ప్లాన్, తాగు నీటి ప్రాజెక్టుల అభివృద్ధిపై ఎంఏయూడీ, జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు ఉన్నతాధికారులతో మంత్రి గురువారం ఎంసీహెచ్చార్డీలో సమావేశమయ్యారు. వచ్చే రెండేండ్లలో రూ.5 వేల కోట్లతో సీవరేజీ ట్రీట్ మెంట్, డ్రింకింగ్ వాటర్ సౌలతులు కల్పించనున్నట్లు వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో వంద శాతం మురుగునీటిని శుద్ధి చేసేందుకు రూ. 3,866.21 కోట్లతో 31 ఎస్టీపీల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, గ్రామాలు, కాలనీలకు తాగునీటిని సరఫరా చేసేందుకు రూ.1200 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లోని మురుగు నీటి సమస్య నివారణకు ఒకే రోజు తెలంగాణ ప్రభుత్వం 5 వేల కోట్ల రూపాయల నిధులను ప్రకటించిందన్నారు. నాలాలను ఆక్రమించి నివాసం ఉంటున్న వారికి డబుల్ బెడ్రూం ఇండ్లలో 14 శాతం కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. నాలాలపై ఆక్రమణలను ప్రయారిటీ ప్రకారం తొలగిస్తామని, ఆ వెంటనే రిటెయినింగ్ వాల్ నిర్మించేలా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

కంటోన్మెంట్‌ను గుంజుకోం

కంటోన్మెంట్‌‌ను తాము గుంజుకోబోమని, ఆ ప్రాంతం చుట్టూ హైదరాబాద్ విస్తరించిందని కేటీఆర్ అన్నారు. ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ఆర్మీ అధికారులతో చర్చించినా సహకరించట్లేదని, కంటోన్మెంట్ ప్రాంతాన్ని  గ్రేటర్‌‌లో విలీనం చేయాలనే డిమాండ్‌‌కు స్థానికులు అంగీకరిస్తున్నట్లుగా తెలిపారు. సీఎం కేసీఆర్‌తో చర్చించి కంటోన్మెంట్ పై భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సమావేశంలో బల్దియా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, వాటర్ బోర్డు ఎండీ దానకిషోర్ ఉన్నారు.