కాంగ్రెస్కు అధికారం ఇస్తే రైతుల జీవితం అంధకారమే : కేటీఆర్

దత్తత తీసుకున్న నల్గొండ రూపురేఖలు ఏడాదిలో మార్చాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ ఆదేశాలతో తాము పట్టణంలో పాదయాత్ర చేసి.. సమస్యలు తెలుసుకుని అభివృద్ధి చేశామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నల్గొండ ఐటీ హాబ్ రూపు దిద్దుకుందన్నారు. నిధులు ఇచ్చింది కేసీఆర్ అయితే.. నల్గొండ రూపురేఖలు మార్చింది ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. నల్లగొండను కేసీఆర్ దత్తత తీసుకుంటే... అభివృద్ధి పనులను ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చూసుకుని అద్దంలా తీర్చిదిద్దారని చెప్పారు. సూర్యాపేట‌లో ఐటీ హ‌బ్‌ను ప్రారంభించిన అనంత‌రం అక్కడ ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.

కోతల రాయుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉండి చేయలేని అభివృద్ధి పనులను ఎమ్మెల్యేగా భూపాల్ రెడ్డి చేసి చూపించారని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పని తీరు చూసి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మెదడు దెబ్బతిందన్నారు. పూటకో మాట మాట్లాడే కోమటిరెడ్డి మాటలను ఎవరూ పట్టించుకోవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే రైతుల జీవితం అంధకారం అవుతుందని, మూడు గంటల కరెంటే దిక్కవుతుందన్నారు. సీల్డ్ కవర్ సీఎంలా ఏడాదికి ఒకరు చొప్పున ఐదుగురు ముఖ్యమంత్రులు మారుతారని చెప్పారు. ఆకాశం నుండి పాతాళం దాకా కుంభకోణాలు గ్యారెంటీ అన్నారు. 

ALSO READ : మేఘాలయ, అస్సాంలో భూ ప్రకంపనలు

నల్లగొండ నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.1300 కోట్ల అభివృద్ధి పనులు చేశామన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ నేతలు నల్లగొండ జిల్లాను ఏనాడు పట్టించుకోలేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. ప్రతి పౌరుడికి రూ.15 లక్షలు ఇస్తామని చెప్పిన మోదీ ఇచ్చారా..? అని ప్రశ్నించారు. చాలామంది ఎన్నికల సమయంలో వస్తుంటారని, వారి మాటలు విని ప్రజలు మోసపోవద్దన్నారు.

నల్లగొండ టౌన్ లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మరో రూ.700 కోట్ల నిధులతో నల్గొండ మున్సిపాలిటీలో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ వెంట మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.