సిరిసిల్లను వేల కోట్లతో అభివృద్ధి చేశా: మంత్రి కేటీఆర్

రాజన్న సిరిసిల్ల,వెలుగు: సిరిసిల్ల ను వేల కోట్లతో అభివృద్ధి చేశానని, నేతన్నల కోసం ప్రత్యేక పథకాలు పెట్టి  వారి బతుకును మార్చానని ఐటీ,పురపాలక మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం బీఆర్​ఎస్ సిరిసిల్ల నియోజక వర్గ స్థాయి ప్లీనరీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఎట్లున్న సిరిసిల్ల ఎట్లయిందన్నారు. ఉమ్మడి సిరిసిల్ల నేతన్నల కోసం వర్కర్ టూ ఓనర్ పథకం తెచ్చి రూ. 400  కోట్లతో అపెరల్ పార్క్ నిర్మిస్తున్నామన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజ్​ మంజూరు చేశామన్నారు. కేంద్రం ఇటీవల గ్రామాలకు అవార్డులు ప్రకటిస్తే 30 శాతం అవార్డులు తెలంగాణ సొంతం చేసుకుందని కేటీఆర్ చెప్పారు.  రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంబీరావుపేట, మండేపల్లి గ్రామాలకు అవార్డులు దక్కాయన్నారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, బీఆర్​ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జిందం చక్రపాణి, జడ్పీ చైర్​ పర్సన్​ అరుణ, పవర్లూం టెక్స్​ టైల్ చైర్మన్ గుడూరి ప్రవీణ్,  చీటి నర్సింగ్ రావు, గడ్డం నర్సయ్య పాల్గొన్నారు. 

ప్లీనరీ సమావేశానికి వర్షం అంతరాయం

వేదికపై ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతుండగా వర్షం పడింది. ఈదురు గాలులతో వర్షం జోరు పెరగగానే కేటీఆర్ తో సహా ఇతర నాయకులు సభ నుంచి వెళ్లిపోయారు.  కేటీఆర్ చివరి ప్రసంగం ఇవ్వకుండానే సభను ముగించారు. వర్షం పడటంతో అక్కడే ఉన్న సామాన్య కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.  ముఖ్య నాయకులు ఎవరు కార్యకర్తలను పట్టించుకోలేదు. దీంతో వందలాది మంది కార్యకర్తలు వర్షం లో ఇబ్బందులు పడ్డారు.  టెంట్ కిందనే చాల సేపు ఉండాల్సి వచ్చింది. రెండు గంటల పాటు ఈదురుగాలులతో కురిసన జోరు వానతో టెంట్లు తడిచిపోయాయి.  కార్యకర్తలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.