తెలంగాణ.. కోనసీమలా మారింది: మంత్రి కేటీఆర్

  • అభివృద్ధిలో దేశానికి తెలంగాణ పల్లెలు ఆదర్శం
  • 15 రోజుల్లో మల్కపేట జలాశయాన్ని ప్రారంభిస్తాం
  • అధికారం శాశ్వతం కాదని కామెంట్​
  • రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటన

రాజన్నసిరిసిల్ల, వెలుగు: కాళేశ్వరం జలాలతో తెలంగాణ ఇప్పుడు కోనసీమలా మారిందని, ఇక్కడ సినిమా షూటింగ్‌‌‌‌‌‌‌‌లు జరుగుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం ఆయన సిరిసిల్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చేపట్టిన వైద్యాఆరోగ్య శాఖ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ.. కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం గుడులు, బడులను అభివృద్ధి చేస్తున్నదని చెప్పారు. గంభీరావుపేటలోని  కేజీ టు పీజీ క్యాంపస్ లాగానే ఎల్లారెడ్డి పేట ప్రభుత్వ స్కూల్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు.

మరో 15 రోజుల్లో కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పల్లెలు అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని ఆరోపించారు. కేసీఆర్  చొరవతో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. 

అన్ని స్కీంలు సిరిసిల్లకేనా అని అడుగుతున్నరు

ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశం లేకుండా అభివృద్ధి చేస్తున్నామని, ఒక్క సిరిసిల్లలోని అభివృద్ధిని చూసినా వారు మాట్లాడడానికి ఏమీ ఉండదని కేటీఆర్​ అన్నారు. అన్ని స్కీంలు సిరిసిల్లకేనా అని ఇతర జిల్లాల పద్మశాలీలు అడుగుతున్నారని, కేవలం బతుకమ్మ చీర తయారీకి ఇప్పటివరకు రూ.25 వందల కోట్లు కేటాయించామని తెలిపారు. ‘‘సిరిసిల్ల ప్రజల దయతో నేను ఎమ్మెల్యేను, మంత్రిని అయిన. అధికారం శాశ్వతం కాదు.. భవిష్యత్ లో నేను ఇక్కడ లేకపోయినా ప్రపంచంతో పోటీ పడి చేయాలి” అని అన్నారు. కాగా, ఎల్లారెడ్డిపేటలో టెంపుల్​పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి కేటీఆర్​తిరిగి వెళ్తుండగా కాన్వాయ్ ని బీజేవైఎం నేతలు పాత బస్టాండ్ వద్ద అడ్డుకున్నారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. 

శిలాఫలకం మీద పేరు పెట్టలేదని ఎంపీటీసీ కన్నీరు 

ఎల్లారెడ్డిపేట వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ శిలా ఫలకంపై తన పేరు లేకపోవడంపై ఎంపీటీసీ -2 ఎనగందుల అన సూయ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే గ్రామంలో ఉన్న ఎంపీటీసీ- 1 పేరు పెట్టి, దళిత మహిళనైన తన పేరు ఎందుకు పెట్టలేదని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.