ఎస్ఆర్​డీపీ ఫేజ్ 2​లో 3 వేల కోట్లతో సిటీ రోడ్ల అభివృద్ధి

గచ్చిబౌలి, వెలుగు:హైదరాబాద్​లో మెట్రో రెండో ఫేజ్ పనుల కోసం కేంద్రంతో చర్చిస్తున్నామని, కేంద్రం సహకరించకపోతే తామే ప్రాజెక్టును టేకప్ చేస్తామని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం గచ్చిబౌలి ఔటర్ రింగు రోడ్డు నుంచి శిల్ప లేఅవుట్ వరకు ఎస్ఆర్​డీపీ ప్రాజెక్టులో రూ.466 కోట్లతో నిర్మించిన ఫోర్​లేన్ బై డైరెక్షనల్ ఫ్లైఓవర్​ను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అన్నీ హంగులతో విశ్వనగరంగా ఏదిగే అవకాశం ఉన్న సిటీ హైదరాబాద్ అని అందుకే సీఎం కేసీఆర్ ఎస్ఆర్ డీపీ(స్ట్రాటజిక్ రోడ్ డెవలప్​మెంట్ ప్రొగ్రాం)ను 2014, 2015లో రూపొందించారని, ఎస్ఆర్ డీపీ సీఎం మానస పుత్రిక అని అన్నారు. ఈ ఆరేండ్లలో మొత్తం 48 ఎస్ఆర్​డీపీ ప్రాజెక్టుల్లో 33 ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. ఇతర దేశాల్లో పర్యటించే సమయంలో ఆ దేశస్థులు హైదరాబాద్ నగరంలో ఉన్న సౌలత్​లు చాలా బాగున్నాయని అభినందించారని చెప్పారు. సిటీలో ఉన్న ఇన్​ఫ్రాస్ట్రక్చర్, సౌలత్​లు దేశంలోని ఏ నగరంలో కూడా లేవని తెలిపారు. ఇదే విషయాన్ని దేశం, అంతర్జాతీయంగా పేరున్న సర్వే సంస్థలు కూడా తెలియజేశాయని గుర్తు చేశారు. నగరంలో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు పెరుగుతుండడంతో ఉపాధి కోసం అనేక మంది హైదరాబాద్ వస్తున్నారని, దీంతో హైదరాబాద్ నలువైపులా విస్తరిస్తోందన్నారు. ఒక ఎస్ఆర్​డీపీలో రూ.8వేల కోట్లతో పనులు చేస్తున్నామని, రెండో ఫేజ్ లో రూ.3వేల కోట్లతో పనులు చేపడుతామన్నారు. సిటీలో సీఆర్ఎంపీ ప్రాజెక్టులో రోడ్లు డెవలప్​మెంట్ చేపడుతున్నామని, ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు లింకు రోడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

మెట్రో రెండో దశ 36 కి.మీ 

‘‘ఎంఎంటీఎస్ కోసం రూ.200 కోట్లు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ గురువారమే ఆర్థిక శాఖకు చెప్పారు. మెట్రో రైల్ రెండో దశ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నం. కేంద్రం సహకరించినా.. సహకరించకపోయినా రెండో దశ పనులు చేపడుతం. 2ఫేజ్​లో భాగంగా బీహెచ్ఈఎల్ నుంచి లక్డికాపూల్ వరకు 26 కిలో మీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీనగర్​ వరకు 5 కిలోమీటర్లు, మైండ్​స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్​పోర్టు వరకు 32 కిలోమీటర్లు, మొత్తం 63 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టును టేకప్​ చేస్తం” అని కేటీఆర్ అన్నారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం తక్కువైందని, కేంద్రం నుంచి రావల్సిన డబ్బులు రావడం లేదని, దీంతో రాష్ట్రంలో అనుకున్న విధంగా డెవలప్​మెంట్ జరగడం లేదన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన ఫ్లైఓవర్​తో గచ్చిబౌలి జంక్షన్​లో 50 శాతం ట్రాఫిక్ రిలీఫ్​ ఉంటుందని, రెండో ఫేజ్​ఫ్లై ఓవర్ కొండాపూర్​ బొటానికల్ గార్డెన్ నుంచి గచ్చిబౌలి ఓఆర్​ఆర్ వరకు 10 నెలల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కొత్తగూడ ఫ్లైఓవర్​ను ఈ డిసెంబర్​ చివర లేదా జనవరి నెల మొదట్లో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. శిల్పలేఅవుట్​ వద్ద వాహనాల రద్దీ తగ్గించేందుకు ఐకియా వైపు నుంచి టీ హబ్ వైపు అండర్ పాస్​నిర్మించాలని, దీనిపై ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారని తెలిపారు.