కరీంనగర్, వెలుగు: ‘‘తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో దుమ్ము రేపుతున్నాయి. తెలుగు పార్టీ కూడా భారతదేశంలో దుమ్ము రేపాలి కదా.. సీఎం కేసీఆర్ రేపు తీసుకోబోయే సంచలన నిర్ణయం ఇండియా మొత్తం దుమ్మురేగాలని కోరుకుంటున్నాను” అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కళోత్సవాల చివరి రోజు ఆదివారం మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. కరీంనగర్ గడ్డ నుంచి సింహగర్జన చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఇక్కడి నుంచే జాతీయ పార్టీ సభ కూడా సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యమంలో కేసీఆర్ మాట.. కళాకారుల పాట అంతే స్థాయిలో పేలాయని అన్నారు. ‘‘ఒకప్పుడు సినిమా రంగంలో తెలంగాణ భాష మాట్లాడితే ఇబ్బంది పడేవాళ్లు.. ఈరోజు తెలంగాణ భాష మాట్లాడితేనే సినిమాలు హిట్ అవుతున్నయ్” అని తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో పని చేసిన 574 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి పే స్కేల్ అందించామని ఆయన అన్నారు. కరీంనగర్ స్ఫూర్తితో మిగతా అన్ని జిల్లాల్లోనూ... హైదరాబాద్ లో కూడా ప్రతి ఏటా కళోత్సావాలు జరుపుకొని తెలంగాణ వైభవాన్ని చాటుదామని చెప్పారు. నాడు ఎరుపు జెండా ఎత్తుకున్న వాళ్లంతా ఇప్పుడు కేసీఆర్ వెంట నడుస్తున్నారని అన్నారు.
జాతీయ పార్టీ మీటింగ్ ఇక్కడే పెట్టాలి: గంగుల
2001 లో టీఆర్ఎస్ సింహ గర్జన చేసింది ఇక్కడి నుంచేనని.. ప్రకటించబోయే పార్టీ సమావేశం కూడా ఇక్కడే నిర్వహించాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కవులు, కళాకారులకు పుట్టినిల్లు అయిన కరీంనగర్ కళాకారులను వేదిక ద్వారా పరిచయం చేశామని తెలిపారు. గత మూడు రోజుల పాటు ఉత్సవాలు విజయవంతం అయ్యాయని అన్నారు.
బీజేపీ పేరు మార్చుకోండి
హైదరాబాద్, వెలుగు : బీజేపీ పేరు మార్చుకోవాలని మంత్రి కేటీఆర్ ఆ పార్టీ నేతలకు సూచించారు. బీజేపీ పేరును భారతీయ జన ఈసీ, సీబీఐ, ఈడీ, ఐటీ, ఎన్ఐఏగా మార్చాలని ట్విటర్ లో ఆయన ఎద్దేవా చేశారు. మునుగోడు బైపోల్ నోటిఫికేషన్ ఈ నెల 15 లోపు వస్తుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ బన్సల్ చెప్పడంపై కేటీఆర్ ఆవిధంగా స్పందించారు. ‘‘ఈసీ కంటే ముందే ఎలక్షన్ డేట్లను బీజేపీ నేతలు ప్రకటిస్తున్నరు. ఎవరి ఇళ్లలో సోదాలు జరుగుతాయో ఈడీ కన్నా ముందే వారు చెబుతున్నరు. ఐటీ ఆఫీసర్ల కన్నా ముందే క్యాష్ వివరాలు చెబుతున్నరు. సీబీఐ కన్నా ముందే నిందితుల పేర్లను బీజేపీ నేతలు వెల్లడిస్తున్నరు” అని కేటీఆర్ దుయ్యబట్టారు.