ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ రెడ్డికి ఓటు వేద్దామా: మంత్రి కేటీఆర్

ఓటుకు నోటు కేసులో దొరకిన రేవంత్ రెడ్డి.. డబ్బులు పంచను అని ప్రమాణం చేయాలంటూ సవాల్ విసురుతున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ‌కు ఓటు వేద్దామా అని ప్రశ్నించారు. సోనియాను బలిదేవత అని తిట్టలేదా అని ప్రశ్నించారు. ఒక్క ఛాన్స్ అంటూ ఇప్పుడు కాంగ్రెస్ ను అడగడంలో అర్థం ఏంటని నిలదీశారు. కాంగ్రెస్ ఎన్నో బాధలు పెట్టి తెలంగాణ ఇచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నో పోరాటాలు చేసిన తర్వాతే తెలంగాణ ఇచ్చారని గుర్తుచేశారు. 

కొన్ని తోడేళ్ళు, నక్కలు మాయ మాటలు చెప్పి తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారని చెప్పారు. తెలంగాణ పాలించడం మన వల్ల కాదు.. అని అవమానించిన వారే ఇప్పుడు అడ్డంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అందరి ముందు 50 లక్షలతో ఎమ్మెల్యేను కొందమని అడ్డంగా దొరికిన..  దొంగ పైసలు పంచను అని అమరవీరుల స్థూపం దగ్గర ప్రమాణం చేయడం చూస్తుంటే నవ్వాలో.. ఏడవాలో అర్థం అవుతలేదన్నారు. 

సోనియాగాంధీ దయ తెలిసి తెలంగాణ ఇచ్చిద్దట.. మనం తెలంగాణను ప్రసాదంలాగా తీసుకున్నమట అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ అస్తిత్వం మీద, ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతుంటే చూస్తూ ఊరుకుందామా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ అనే లీడర్ లేకపోతే టీపీసీసీ ఎక్కడిదని నిలదీశారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేసేందుకే ప్రతిపక్షాలు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడినుంచో వచ్చి తెలంగాణ ప్రజలను కించపరుస్తున్నారని విమర్శించారు. 11 సార్లు అధికారం ఇస్తే కాంగ్రెస్ తెలంగాణకు ఏం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.