డబుల్ బెడ్‌రూం ఇళ్లు అమ్మినా.. కిరాయికి ఇచ్చినా పట్టా రద్దు

డబుల్ బెడ్‌రూం ఇళ్లు అమ్మినా.. కిరాయికి ఇచ్చినా పట్టా రద్దు
దేశంలో ఎక్కడా లేని విధంగా 18 వేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలోని లంబాడి తండాలో నిర్మించిన 126 డబుల్ బెడ్రూం ఇళ్లను కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సిటీలో 9, 714 కోట్ల రూపాయలతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని ఆయన అన్నారు. సకల సౌకర్యాలతో నిర్మించి ఇస్తున్న ఈ ఇళ్లను, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని లబ్ధిదారులను ఆయన కోరారు. లబ్ధిదారులు ఇళ్లను అమ్మినా, కిరాయికి ఇచ్చినా.. పట్టాలు రద్దు చేస్తామని హెచ్చరించారు. కేంద్రప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని కేటీఆర్ అన్నారు. ఎన్నికలప్పుడూ మాత్రమే రాజకీయాలని, తర్వాత అందరూ కలిసి అభివృద్ధి కోసం పనిచేయాలన్నారు. లంబాడి తండాలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం.. నాయిని నర్సింహ్మరెడ్డి ఆత్మకు శాంతి కలిగిస్తుందని ఆయన అన్నారు. అంతకుముందు దోమల్ గూడలో 9.90 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న వార్డు ఆఫీసుకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా నారాయణ గూడలో 4 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న మోడల్ మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు. కాగా.. కేటీఆర్ బాగ్‌లింగంపల్లి పర్యటనలో స్థానిక బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పర్యటనలో ప్రొటోకాల్ పాటించలేదని బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. అభివృద్ధి కార్యక్రమాలకు కొత్తగా గెలిచిన బీజేపీ కార్పొరేటర్‌ను పిలవకుండా… పాత కార్పొరేటర్‌ను పిలవడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నినాదాలు చేసిన వారిని అక్కడి నుంచి లాక్కెళ్లారు పోలీసులు. పాత పాలక మండలి ఇంకా డిసాల్వ్ కాలేదని.. ప్రోటోకాల్ పాటించామని అధికారులు చెబుతున్నారు. For More News.. గొర్రెల పంపిణీ మళ్లీ ప్రారంభించండి సిడ్నీ టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ 244 ఆలౌట్ గుజరాత్ మాజీ సీఎం సోలంకి కన్నుమూత