ఏడేండ్ల నుంచి మస్తు ఓపిక పట్టినం.. ఇక తగ్గేదేలేదు

ఏడేండ్ల నుంచి మస్తు ఓపిక పట్టినం.. ఇక తగ్గేదేలేదు

‘విపక్షాల నాయకుల మాటలకు ఏడేండ్ల నుంచి మస్తు ఓపిక పట్టినం. ఇగ చాలు.. బరాబర్ ఇకనుంచి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లే సమాధానం చెబుదాం. వెనక్కు తగ్గేదేలేదు’ అని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జలవిహార్‎లో టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ పై వ్యాఖ్యలు చేశారు.

అప్పట్లో కేసీఆర్‎కు మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు

‘మనందరం వివిధ పదవులలో ఉన్నామంటే దానికి కారణం పార్టీ కార్యకర్తలే. ఏప్రిల్ 27, 2001న పార్టీ ఆవిర్భవించింది. కేసీఆర్ 47 ఏళ్ల వయసులో తెలంగాణ కోసం ముందుకు వచ్చారు. అప్పట్లో ఆయనకు పాపులారిటీ లేదు. అంగ బలం లేదు, అర్ధ బలం లేదు, సినిమా గ్లామర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, మీడియా పవర్ లేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కేసీఆర్ ఒక్కడే. కానీ, ఆ ఒక్కడు ఇప్పుడు లక్షల మంది అయ్యారు. తాము ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది పదవుల కోసం కాదని.. ప్రజలలో నమ్మకం కలిగించడం కోసం ఆనాడే కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే సభ్యత్వానికి, టీడీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజకీయాలపై ప్రజలలో ఉన్న అపనమ్మకాన్ని పోగొట్టడం కోసం.. తాను ఉద్యమం నుంచి పక్కకు తప్పుకున్నా.. ఎత్తిన జెండాను కిందకు దించినా.. నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని కేసీఆర్ అనాడే చెప్పాడు. భారత చరిత్రలో ఇలా చెప్పిన ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమే. తెలంగాణ కోసం కాంగ్రెస్, టీడీపీలతో పొత్తు పెట్టుకొని వారిని తెలంగాణకు అనుకూలంగా మార్చారు. కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల్లో గెలిచిన తర్వాత తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసింది. దాంతో తెలంగాణ ప్రజల సత్తా ఏంటో చూపించాలనే ఉద్దేశంతో నవంబర్ 29, 2009న కేసీఆర్ నిరాహారాదీక్షకు కూర్చున్నారు. ఆ దెబ్బతో ఉద్యోగులు, విద్యార్థులు, తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్‎కు అండగా నిలిచింది. దాంతో తప్పని పరిస్థితుల్లో కేంద్రం తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది.

పేరుకే అవి ఢిల్లీ పార్టీలు.. చేసేవన్నీ సిల్లీ పాలిటిక్స్

టీ బీజేపీ, టీ కాంగ్రెస్ నాయకులకు పదవులు ఎక్కడి నుంచి వచ్చాయి. వారి పదవులన్నీ కేసీఆర్ భిక్షే. కేసీఆర్ లేకపోతే మీ పార్టీలెక్కడివి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‎లో మిమ్మల్ని దేకినోడేవడు. గంజిలో ఈగలా ఎగిరెగిరి పడుతున్న ఆ నాయకులను ఎవరైనా పట్టించుకుంటరా? మనం, మన పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణతో ఉండాలని, ఏది పడితే అది మాట్లాడొద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కానీ, విపక్షాల చిల్లర నాయకుల లేకి మాటలు వింటే ఒక్కోసారి ఆవేశం వస్తది. కేసీఆర్ కాలు గోరుకు సరిపోని వాళ్లందరూ మాట్లాడుతున్నరు. తెలంగాణ ప్రజలు రెండుసార్లు సీఎంగా ఎన్నుకున్న కేసీఆర్ గురించి ఇష్టవచ్చినట్లు మాట్లాడుతున్నరు. పేరుకే అవి ఢిల్లీ పార్టీలు.. చేసేవన్నీ సిల్లీ పాలిటిక్స్. తెలంగాణ ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉంటే.. విపక్షాల కడుపు మండుతుంది. తెలంగాణలో పైరులు పచ్చబడుతుంటే.. వాళ్ల కళ్లు ఎర్రబడుతున్నాయ్. మంత్రి శ్రీనన్న ఓపిక పట్టాలంటుండు. కానీ, ఏడేండ్ల నుంచి మస్తు ఓపిక పట్టినం. ఇగ చాలు.. బరాబర్ ఇకనుంచి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లే సమాధానం చెబుదాం. వెనక్కు తగ్గేదేలేదు. ఇప్పటినుంచి కేసీఆర్ గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే.. కుక్క కాటుకు చెప్పు దెబ్బే. ఆయనను ఎవరైనా ఒక్క మాట అంటే.. మనం పది మాటలు అనాలి. ఇకనుంచి విడిచిపెట్టేది లేదు. ఊకుంటే చిల్లరగాళ్లు ఎక్కువ అయితున్నరు. 

హుజురాబాద్ ఎన్నిక ఒక చిన్న ఎన్నిక

రాష్ట్రంలో రైతులు, మహిళలు సంతోషంగా ఉన్నారు కాబట్టే.. మనల్ని కడుపునిండా దీవించినరు. అందుకే ఏ ఎన్నిక వచ్చినా గులాబీ జెండాకే జై కొడుతున్నరు. ఎన్నిక ఏదైనా గెలుపు మాత్రం టీఆర్ఎస్‎కే పట్టం కడుతున్నారు. విపక్షాల నేతలంతా.. పత్రికల్లో పతాక శీర్షీకల కోసం, జనాల్లో ప్రచారం కోసం, నోటి దూల తీర్చుకోవడం కోసం మాత్రమే మాట్లాడుతున్నారు. అందుకే వీళ్లను జనాలెవరూ సీరియస్‎గా తీసుకోవడంలేదు. రాబోయే రెండున్నరేండ్ల వరకు మనముందు ఏ ఎన్నిక లేదు. ఈ హుజురాబాద్ ఎన్నిక ఒక చిన్న ఎన్నిక. అది అసలు సమస్యే కాదు. అది అక్కడున్న మనవాళ్లే చూసుకుంటరు. మనకు చాలా టైం ఉంది కాబట్టి మనం విపక్షాల చిల్లర మాటలను తిప్పికొట్టాలి. అందుకోసం సెప్టెంబర్ 20వ తేదీ లోపున జీహెచ్ఎంసీలో కమిటీలు వేసుకోవాలి. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులకు పదవులు రాక నిరాశలో ఉన్నారు. వారందరికోసం వివిధ కార్పొరేషన్లలో 500 పదవులు కేటాయిస్తాం. ఆ బాధ్యత నేను తీసుకుంటా. ఎవరూ అసంతృప్తి చెందొద్దు. ఎవరికి ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా పనిచేయాలి. మనం కమిటీలతో కలిసి సోషల్ మీడియాను వినియోగించుకోవాలి. బిడ్డ పుట్టినప్పటి నుంచి ఆ బిడ్డ చదువు పూర్తయి, పెళ్లి జరిగే వరకు ప్రభుత్వమే ఆదుకుంటుంది. ప్రజల కోసం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వాలు 75 ఏండ్లలో మూడు ప్రభుత్వ ఆస్పత్రులు నిర్మిస్తే.. మన ప్రభుత్వం నాలుగు టిమ్స్ ఆస్పత్రలను అందుబాటులోకి తీసుకోస్తోంది. ఈ ఆస్పత్రులు పేదవారికి కల్పతరువులాగా మారతాయి. పేదవారికి ఏం కావాలో కేసీఆర్‎కు తెలుసు కాబట్టే ప్రజలు ఆయన వెంట ఉంటున్నారు. మనం చేయాల్సిందల్లా.. మన ప్రభుత్వం చేసిన, చేయబోయే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.

ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, పార్టీ సెక్రటరీ జనరల్ శ్రీ కేశవరావు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు.