రాష్ట్రం నుంచి జీఎస్టీ కింద 3 లక్షల 68 వేల కోట్లు కేంద్రానికి కడితే.. లక్షా 68వేల కోట్లు మాత్రమే ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు. తాను చెప్పిన లెక్క తప్పని నిరూపిస్తే.. తన మంత్రి పదవికి రాజీనామా చేసి మీ మొఖాన పారేస్తానని కేటీఆర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. కరోనా సమయంలో కుర్ కురే ప్యాకెట్లు పంచిండని కిషన్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. గుజరాత్లో దోచుకున్న సందపదను సెస్ ఎన్నికల్లో ఖర్చు చేశారని బీజేపీపై కేటీఆర్ మండిపడ్డారు. అప్పుడు డబ్బులు పంచిది వాళ్లే.. మళ్లీ ఇప్పుడు ఎందుకు గొడవ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి దమ్ముంటే మంచి పనులు చేయాలని సూచించారు. ఆనాడు సెస్ ను కాపాడింది టీఆర్ఎస్ పార్టీయే అని కేటీఆర్ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన స్వచ్ఛ్ సర్వేక్షణ్‌లో సిరిసిల్ల ప్రథమ స్థానంలో ఉన్న విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలకు సిరిసిల్ల ఒక దిక్సూచి అని చెప్పారు. రాష్ట్రంలో బస్సు ఛార్జీలు పెంచితే గగ్గోలు పెడుతున్నారని.. మరి ఆర్టీసీని ఎలా కాపాడాలని ప్రశ్నించారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రజల మధ్య కొట్లాట జరుగుతోందని.. మరి అక్కడ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వమే ఉందని ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య గట్టు పంచాయితీని సరిచేయలేని మోడీ.. రష్యా, ఉక్రయిన్ యుద్ధం ఎలా ఆపుతాడట అని విమర్శించారు. అసలు మోడీకి ఎవరికి దేవుడు.. సిలిండర్, పెట్రోల్ ధరలు పెంచితే దేవుడు అవుతాడా అని కేటీఆర్ ప్రశ్నించారు.