జీహెచ్‌‌ఎంసీ ఆఫీసర్లపై కేటీఆర్ సీరియస్‌‌

జీహెచ్‌‌ఎంసీ ఆఫీసర్లపై కేటీఆర్ సీరియస్‌‌
  • ఉద్యోగాల నుంచి పీకేస్తా: కేటీఆర్ 
  • వానాకాలం వచ్చినా నాలా పనులు 40 శాతమేనా?
  • జీహెచ్‌‌ఎంసీ ఆఫీసర్లపై మంత్రి సీరియస్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: భారీ వర్షాలకు వరదలు ముంచెత్తి హైదరాబాద్ లో ఒక్కరు చనిపోయినా ఇంజనీర్ల సంగతి చెప్తానని మంత్రి కేటీఆర్‌‌ హెచ్చరించారు. వానాకాలం వచ్చినా నాలా పనులు 40 శాతమే పూర్తి చేయడం ఏమిటని జీహెచ్ఎంసీ ఆఫీసర్లపై సీరియస్ అయ్యారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌ పరిధిలో చేపట్టిన స్ట్రాటజిక్‌‌ నాలా డెవలప్‌‌మెంట్‌‌, ఇతర పనులపై గురువారం బేగంపేట క్యాంపు ఆఫీస్‌‌లో కేటీఆర్ సమీక్షించారు. ఒక్క వానకే నగరంలోని పలు ప్రాంతాల్లో నీళ్లు నిలిచాయని, రానున్న రోజుల్లో ఈ సమస్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి ఎవరైనా చనిపోతే ఎలా అని ప్రశ్నించారు. జీహెచ్‌‌ఎంసీ పరిధిలో పని చేసే ఇంజనీర్ల చిట్టా మొత్తం తన దగ్గర ఉందని, ఎవరెవరు ఏమేం చేస్తారో ప్రతిదీ తనకు తెలుసన్నారు. ఒక్క ప్రమాదం జరిగినా ఆ పరిధిలోని ఇంజనీర్లందరినీ ఉద్యోగాల నుంచి పీకేస్తానని హెచ్చరించారు. 

ఎందుకింత నిర్లక్ష్యం? 

ముంపు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నాలాల అభివృద్ధి పనులు చేపడితే, ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధికారులను కేటీఆర్ ప్రశ్నించారు. నెలల తరబడి 40 శాతం పనులే పూర్తి చేస్తారా? అంటూ మండిపడ్డారు. వానాకాలంలో ప్రాణనష్టం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నాలాల అభివృద్ధి పనుల్లో స్పీడ్‌‌ పెంచాలని, వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు. మాన్ సూన్‌‌ యాక్షన్‌‌ టీమ్​లు 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.