మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ గీతన్నలపై వరాల జల్లు కురిపించారు. వృత్తిలో ప్రమాదాలు నివారించే చర్యలు తీసుకుంటామని, గీత కార్మికులందరికీ ద్విచక్ర వాహనాలు, లిక్కర్ షాపుల్లో గౌడ్ లకు ఇచ్చే 15శాతం రిజర్వేషన్లు సొసైటీలకు ఇస్తామని, గీతన్న బీమా పథకం, గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఆయన ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ సర్కార్ నేటి వరకు అమలు చేయలేదు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే లిక్కర్ షాప్ టెండర్లలో వ్యక్తులకు కాకుండా సొసైటీలకు రిజర్వేషన్స్ కల్పించాలి అని కోరాం.
సొసైటీలకే రిజర్వేషన్లు కల్పిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పినప్పటికీ మొన్నటి టెండర్లలో పాత పద్ధతినే కొనసాగించారు. ద్విచక్ర వాహనాలు ఇస్తారని గత రెండు సంవత్సరాల నుంచి ఆశతో ఎదురుచూస్తున్న కల్లు గీత కార్మికులకు నిరాశే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టిన 2023–24 బడ్జెట్లో ఆర్థికమంత్రి హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడుతూ.. గీత కార్మికుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించామని చెప్పారు. బడ్జెట్ పత్రంలో మాత్రం రూ.30 కోట్లు మాత్రమే చూపించారు. బడ్జెట్ పెట్టి ఆరు నెలలు అవుతున్నా ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు పదేండ్లకు రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్పొరేషన్‌కు చైర్మన్‌ను నియమించింది. దీనివలన వారి రాజకీయ ప్రయోజనం నెరవేరింది తప్ప గీత కార్మికులకు అదనపు ప్రయోజనం ఒనగూడింది లేదు.
దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్న మన తెలంగాణ రాష్ట్రంలో కల్లు గీస్తున్న గౌడన్నల బతుకులకు భరోసా లేకుండా పోయింది. తాళ్లు ఎక్కే క్రమంలో ప్రమాదం జరిగి వందలాదిమంది చనిపోతున్నారు. కాళ్లు, చేతులు విరుగుతున్నాయి. నడుములు పడిపోయి మంచాన పడుతున్నారు. అచేతనావస్థలో ఉన్నవారు చావలేక బతుకులీడుస్తున్న దుస్థితి నెలకొంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏటా సగటున 550 మంది గౌడన్నలు చెట్టుపై నుంచి జారి పడుతున్నారు. వారిలో సగటున 180 మంది చనిపోతున్నారు.
అంటే ప్రతి రెండు రోజులకు ఒక గీత కార్మికుడు చనిపోతున్నాడు. కల్లు గీత వృత్తిలో ఉన్నంత ప్రమాదం ఏ వృత్తిలోనూ లేదు. ప్రపంచం అత్యాధునిక టెక్నాలజీతో దూసుకుపోతూ చంద్రయాన్ లాంటి విజయవంతమైన ప్రయోగాలు చేస్తున్న ఈ తరుణంలో సంప్రదాయ పద్ధతిలో సాగుతున్న గీత వృత్తిలో సాంకేతికత పెంచాల్సిన అవసరం ఉంది. సీఎం కేసీఆర్ఇటీవల ప్రకటించిన గీతన్న బీమా నేటికీ అమలు కావడం లేదు.
రూ.5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలి
గీత వృత్తిలో ఉపాధి పెరగాలంటే సొసైటీలకు తాటిచెట్ల పెంపకానికి భూమి ఇవ్వాలి. కల్లులోని పోషకాలను, ఔషధ గుణాలను ప్రభుత్వమే ప్రచారం చేసి మార్కెట్ సౌకర్యం కల్పించాలి. నీరా, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ప్రతి జిల్లా కేంద్రంలో నెలకొల్పి వృత్తిని ఆధునీకరించి ఉపాధి పెంచాలి. అందుకు రూ.5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలి. ఉమ్మడి రాష్ట్రంలో గీత కార్మిక సొసైటీలకు అప్పటి ప్రభుత్వాలు ఇచ్చిన భూములకు రక్షణ లేకుండా పోతోంది. రియల్టర్ల కన్ను పడటంతో అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇందుకుగాను ఆయా సొసైటీల పరిధిలో ఉన్న భూములకు ప్రభుత్వమే రక్షణ కోసం కంచెలు నిర్మించాలి.
ప్రతి సొసైటీకి 5 ఎకరాలు భూమి ఇవ్వాలనే జీవో నెం 560 ని అమలు చేయాలి. హైబ్రిడ్ తాటి, జీలుగ, ఖర్జూర, ఈత చెట్లను అభివృద్ధి చేసి సొసైటీలకు పంపిణీ చేస్తే భవిష్యత్‌లో యువతకు ఉపాధి అవకాశాల వీలు కలుగుతుంది. గీత వృత్తికారులుఎక్కడ ప్రమాదానికి గురై చనిపోయినా, శాశ్వత వికలాంగులైనా పదిలక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ప్రస్తుతం ఇస్తున్న ఎక్స్ గ్రేషియా యథావిధిగా కొనసాగిస్తూనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన గీతన్న బీమా అమలు చేయాలి. తాటి, ఈత చెట్లు నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకునే విధగా కొత్త చట్టం తీసుకురావాలి. ప్రభుత్వం ఇంకా నిర్లక్షం చేసి ఇచ్చిన హామీలు అమలు చేయనట్లయితే రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి గౌడ్లు ఓట్లు వేయడం కష్టమే.
నీరా కేఫ్‌కు బిడ్డింగ్ ఎందుకు?
నీరా కేఫ్‌కు ఎందుకు టెండర్ వేయాల్సివచ్చింది. గత అనేక సంవత్సరాలుగా సంఘాలు పోరాటం చేసిన ఫలితంగా అక్టోబర్28-, -2019 న తెలంగాణ ప్రభుత్వం నీరా పాలసీ తీసుకువచ్చింది. జీవో నెంబరు 116 విడుదల చేసింది. గౌడ, ఈడిగ కులంవారు మాత్రమే నీరా తీయడం, సేకరణ, అమ్మకాలు చేయాలని దీనిలో ప్రకటించింది. రూ.25 కోట్లు నీరా కోసం బడ్జెట్ కేటాయించింది. నెక్లెస్ రోడ్లో నీరా కేఫ్ నిర్మాణం చేపట్టి చాలా గొప్పగా ప్రారంభించింది. రంగారెడ్డి జిల్లా ముద్విన్, సంగారెడ్డి జిల్లా మునిపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా సర్వేల్, నందనం నుంచి నీరా సేకరణ చేయాలని నిర్ణయించింది.
నందనంలో మిషనరీ ఏర్పాటు చేసి అక్కడ బై ప్రొడక్ట్స్ తయారు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నీరా సేకరణ జరుగుతున్నది. నీరా కేఫ్‌లో అమ్మకాలు బాగా జరుగుతున్నాయి. ఎక్కువ సెంటర్లలో అమ్మితే ఇంకా అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. ప్రారంభంలో దీని నిర్వహణ టూరిజం శాఖకు అప్పగించారు. ప్రారంభమై ఐదు నెలలు కాకముందే నీరా కేఫ్ బిడ్డింగ్‌కు టూరిజంశాఖ నోటీసు ఇచ్చింది. మంచి లాభాలతో నడుస్తున్న ఈ కేఫ్‌ని ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టడం సరైంది కాదు. రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ లక్ష్యం గీత కార్మికులకు ఉపాధి కల్పించడం, ఆధునిక పద్ధతులు- అవలంబించడం. అందుకని టెండర్ విధానం రద్దుచేసి టాడి కార్పొరేషన్‌కి అప్పగించి గీత కార్మికుల ఉపాధి అవకాశాలు పెంచడం కోసం కృషి చేయాలి.
- మేకపోతుల వెంకటరమణ,రాష్ట్ర అధ్యక్షుడు, కల్లుగీత కార్మిక సంఘం