బండి..ఇది ట్రైలరే..2023లో అసలు సినిమా చూపిస్తా:కేటీఆర్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్ అభివృద్ధికి ఆయన ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. గుజరాత్ లీడర్లు వస్తే చెప్పులు నెత్తిమీద పెట్టుకోవడం తప్ప ఆయన చేసిందేమీ లేదని అన్నారు. ఈసారి కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ గెలవడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు దీనిని ఛాలెంజ్గా తీసుకుని పనిచేయాలన్నారు. ప్రస్తుతం బీజేపీకి కనిపిస్తున్నది ట్రైలర్ మాత్రమేనని 2023లో అసలు సినిమా చూపిస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. 

14 మంది ప్రధానులు చేసిన అప్పు కన్నా మోడీ 100 రెట్లు ఎక్కువ చేసినా రాష్ట్రానికి మాత్రం మొండి చేయి చూపారని కేటీఆర్ విమర్శించారు. దేశంలో 20 అత్యుత్తమ గ్రామ పంచాయితీల్లో 19 తెలంగాణలో ఉన్నాయన్న కేటీఆర్ అయినా బీజేపీ నేతలు రాష్ట్రాభివృద్ధిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిజం చెప్పులేసుకునే లోపు అబద్దం ఊరంతా తిరిగి వస్తుందని.. అందుకే అలాంటి అబద్ధాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. మోడీ గుజరాత్ దొస్తుల కోసమే దేశాన్ని నడిపిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. 12 లక్షల కోట్ల రుణాలను కార్పొరేట్ దోస్తులకు మాఫీ చేశారన్నారు. తాను చెప్పేది అబద్దం అయితే దేనికైనా రెడీ అని స్పష్టం చేశారు. కేసీఆర్ అప్పుతో పాటు అభివృద్ధి కూడా చేశారని చెప్పారు.