ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే చండూర్ ని రెవిన్యూ డివిజన్ చేస్తాం

నల్లగొండ జిల్లా: మునుగోడు బై పోల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని గెలిపిస్తే చండూర్ ని రెవిన్యూ డివిజన్ చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. గట్టుప్పల్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన రోడ్డు షోలో మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 4 ఏండ్లు నియోజకవర్గంలోని సమస్యలను ఏమాత్రం పట్టించుకోని రాజగోపాల్ రెడ్డి.. కాంట్రాక్టుల కోసం రాజీనామా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ లో ఉంటూనే బీజేపీకి కోవర్ట్ గా రాజగోపాల్ వ్యవహరించారని మండిపడ్డారు. మునుగోడు అభివృద్ధి కోసం తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. 2009లో తాను ఎమ్యెల్యే గా ఉన్నపుడు ప్లోరైడ్ సమస్య పరిష్యారం కోసం అప్పటి స్పీకర్ నాదేండ్ల మనోహర్ ఆధ్వర్యంలో మునుగోడుకి వచ్చామని గుర్తు చేశారు. ఆనాడు  నల్గొండ జిల్లా నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో అమలవుతోన్న పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. ఒకప్పుడు 200 రూపాయలు ఉన్న పెన్షన్ ను నేడు 2000కు పెంచామని చెప్పారు. రైతు బంధు, దళిత బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని పేర్కొన్నారు.

ఉమ్మడి నల్గొండలో ఫ్లోరైడ్ లేకుండా చేశాం

ఈ ఏడేండ్లలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ లేకుండా చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మునుగోడు బీడు భూములను సస్యశ్యామలం చేయడానికి చెర్లగూడెం రిజర్వాయర్ ను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గట్టుప్పల్ లో చేనేత క్లస్టర్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరి బ్యాంక్ లో రూ.10 లక్షలు, ప్రతి ఏడాది 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ... 75 వేల ఉద్యోగాలతోనే సరిపెట్టారని విమర్శించారు. బీజేపీ నాయకుల మాటలు నమ్మొద్దన్న మంత్రి.. ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.