
దేశంలో తొలిసారి అతిపెద్ద ప్రొటోటైపింగ్ కేంద్రంగా ఏర్పాటు చేసిన టీ–వర్క్స్‌ను మంత్రి కేటీఆర్, ఫాక్స్ కాన్ సంస్థ ఛైర్మన్ యంగ్ లియూ కలిసి ప్రారంభించారు. హైదరాబాద్‌లోని రాయదుర్గంలో 18 ఎకరాల విస్తీర్ణంలో 78 వేల చదరపు అడుగులలో సకల సదుపాయాలతో టీ–వర్క్స్‌ను నిర్మించారు. సంకలిత ప్రోటో టైపింగ్, ఎలక్ట్రానిక్స్ వర్క్‌స్టేషన్, ఫినిషింగ్ షాప్, లేజర్ కటింగ్, పీసీబీ ఫాబ్రికేషన్, కుండల తయారీ, ప్రీ–కంప్లైయన్స్, మెటల్ షాప్ వంటి అత్యాధునిక సాంకేతికతలు ఇక్కడ అందుబాటులో ఉంచారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కర్తలకు అండగా నిలిచేందుకు దేశంలో తొలిసారి 'టీ–వర్క్స్' కేంద్రం ఏర్పాటు చేశారు.
ఉత్పత్తుల ఆవిష్కరణలో టీ–వర్క్స్ దేశంలోనే అగ్రగామిగా నిలిచేలా రూపొందించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. డైలీ వినియోగ వస్తువులను వినూత్నంగా తయారు చేయాలన్న ఆలోచన ఉన్నవారు టీ–వర్క్స్‌కు వచ్చి తమ సృజనాత్మక ఆలోచనలకు పదును పెట్టుకొని వస్తువులను తయారు చేసుకొనే అవకాశం ఇక్కడ ఉందన్నారు. టీ–వర్క్స్‌లో 200కు పైగా అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేశామని, ఇందు కోసం రూ.110 కోట్లు వెచ్చించామని చెప్పారు. టీ–వర్క్స్ మొదటి దశలో భాగంగా 78 వేల చదరపు అడుగుల్లో నిర్మించామని.. ఉత్పత్తుల రూపకల్పన, ఇంజినీరింగ్, ఫ్యాబ్రికేషన్, సోర్సింగ్, మెటీరియల్స్, ఇతర అంశాలపై నిపుణులు అందుబాటులో ఉండి ఆవిష్కర్తలకు సహకరిస్తారని కేటీఆర్ వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఫాక్స్ కాన్ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందని, ఇక్కడ కూడా లక్ష జాబ్స్ ప్రకటించిన యంగ్ లియూకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీ వర్క్స్ సీఈవో సంజయ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో పాటు పలువురు పాల్గొన్నారు.