నల్గొండ జిల్లాలో అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇవాళ నల్గొండ జిల్లా చండూర్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిలు కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన కేటీఆర్.. చండూర్ పట్టణంలో 40 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు. పట్టణంలో రహదారి సుందరికరణకు రూ.30 కోట్లు మంజూరు చేశామని.. రాబోయే రెండు నెలల్లో చండూర్ ను అందంగా ముస్తాబు చేస్తామని తెలిపారు. అలాగే 2 కోట్ల రూపాయలతో సమీకృత మార్కెట్, రూ.50 లక్షలతో షాపింగ్ మాల్ నిర్మాణం కూడా చేపడుతామని అన్నారు. అభివృద్ధి కోసం చండూర్ మున్సిపాలిటీకి రూ.40 కోట్లు, గట్టుపల్ మండలానికి రూ. 8 కోట్ల 91 లక్షలు మంజూరు చేశామన్నారు.
చండూర్ తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు అభివృద్ధి చేస్తామని కేటీఆర్ చెప్పారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యను కేసీఆర్ ప్రభుత్వం శాశ్వతంగా పరిష్కరించిందన్నారు. అదే పద్దతిలో ప్రాజెక్ట్ లు పూర్తిచేసి సాగు నీరు అందిస్తామని..ప్రాజెక్ట్ ల ద్వారా నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఎన్నికల ముందు ఒక మాట.. ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పమని..ఇచ్చిన హామీలను తప్పకుండా పరిష్కరిస్తామని వెల్లడించారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి అభివృద్ధి చేయలేదని వ్యాఖ్యానించారు. పేదవాడి మొఖంలో చిరునవ్వు చూడడమే కేసీఆర్ ఆశయమని అన్నారు. మీరు ఆశీర్వదిస్తే రెట్టింపు అభివృద్ధి పనులు చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.