రాష్ట్రంలో 9 ఏళ్ళుగా అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా తీసుకెళ్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. మే 5వ తేదీ శుక్రవారం ఆయన వరంగల్ జిల్లాలో పర్యటించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్, బీజేపీ నాయకులు సంక్రాంతికి గంగిరెద్దుల మాదిరిగా వస్తున్నారని..కల్లబొల్లి మాటలు చెప్పే పార్టీలను నమ్మి మోసపోకుండా వినయ్ భాస్కర్ ను 70 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు.
దుర్మార్గుడు.. చిల్లరగాడు ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు పదోతరగతి పేపర్ లీక్ చేశాడని.. దిక్కుమాలిన బీజేపీ నాయకుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశంతో పేపర్ లీక్ చేశాడని కేటీఆర్ ఆరోపించారు. పోలీసులు పట్టుకుని జైల్ కు పంపితే బెయిల్ పై బయటకు వేస్తే.. అలాంటి నాయకుడికి దండలు వేసి శాలువాలు కప్పి సన్మానించిన నీచమైన పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. ఇంకా కుట్రలు జరుగుతాయి... మతం పేరిట చిచ్చు పెడుతారు వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. చైతన్యానికి మారుపేరుగా నిలిచే ఓరుగల్లు ప్రజలు ఇది ఆలోచించాలని కేటీఆర్ కోరారు.
రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అమలు చేయలేని సిగ్గుమాలిన దరిద్రపు పార్టీ బీజేపీ అని దూషించారు మంత్రి కేటీఆర్. తెలంగాణను ఏదో ఉద్దరించినట్లు నిరుద్యోగ సభలు పెడుతున్నారని ఎద్దేవ చేశారు. రూ.640 కోట్లతో గ్రేటర్ వరంగల్ లో మంచినీటి సౌకర్యం కల్పించాం..రూ.1100 కోట్లతో హెల్త్ సిటీని నిర్మిస్తున్నామని తెలిపారు. బీజేపీకి నియ్యతి ఉంటే వరంగల్ కు ఏం చేశారో చెప్పాలని సవాల్ చేశారు. మోడీ దోస్త్ కు దోచిపెట్టాలి.. దోస్త్ ఇచ్చే కమీషన్ తో దందాలు చేయాలే ఇదే వాళ్ల ఏజెండా అని విమర్శించారు. మతం పేరిట మంటలు పెట్టుడే తప్ప ఒక్క మంచిపని చేసిందా బీజేపీ అని కేటీఆర్ ప్రశ్నించారు. మోడీ ప్రకటించిన ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి.. నిరుద్యోగ యువత ఆలోచించాలని సూచించారు.
వరంగల్ అంటే వారసత్వ సంపదే కాదు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు కేటీఆర్. ఐటీకి సంబంధించిన 8 నుంచి పది కంపెనీలు వరంగల్ కు వచ్చాయని..ముంబాయికి పూణేలా.. హైదరాబాద్ కు వరంగల్ మారుతుందని తెలిపారు. తెలంగాణ కు వరంగల్ మణిహారంగా మారబోతుందన్నారు. తెలంగాణలో పేదల ప్రభుత్వం ఉంది. అన్ని రాష్ట్రాలకు సీఎం ఉంటారు.. కానీ మనకు రాష్ట్రాన్ని తెచ్చిన సీఎం ఉన్నారని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్.