- సంపద సృష్టిస్తూ పేదల జీవితాలను బాగు చేస్తున్నాం
- ప్రతిపక్షాలకు కూడా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నాం
- సిరిసిల్ల పర్యటనలో మంత్రి కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: సీఎం కేసిఆర్ ఖలేజా ఉన్న నాయకుడని ఆయన సంపద సృష్టిస్తూనే ప్రభుత్వ పథకాలతో పేద ప్రజల జీవితాలను బాగు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి కె. తారక రామారావు అన్నారు. సోమవారం తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా సభల్లో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. దళిత బంధుతో సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో వైకుంఠధామం, నర్సరీ, డంపింగ్ యార్డ్ లను ఏర్పాటు చేశామన్నారు. కేవలం గండిలచ్చ పేట గ్రామంలోనే రూ. 6.89 కోట్లతో అభివృద్ధి, సంక్షేమం కోసం నిధులు ఖర్చు చేశామన్నారు.
24 చెక్ డ్యాంలు నిర్మించాం
మూల వాగు, మానేరు వాగు లపై 24 చెక్ డ్యాం లు నిర్మించామని అన్నారు. చీర్లవంచకు త్వరలో ఒక పీహెచ్‌సీని తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇప్పించే బాధ్యత తనదేనని చెప్పారు. రోడ్ల అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.గృహలక్ష్మి పథకం కింద అర్హులకు రూ.3 లక్షల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. చీర్లవంచలో రూ.12 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. గ్రామంలో అప్పర్‌ప్రైమరీ స్కూల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
రాష్ట్రంలో 16 వేల మెగావాట్లు కరెంట్ ఉత్పత్తి
సమైక్య రాష్ట్రం లో కేవలం 13,117 మెగావాట్ల ఉత్పత్తి జరిగేదని కానీ తెలంగాణలోనే ప్రస్తుతం 16 వేల మెగావాట్ల కరెంట్ఉత్పత్తి దాటిందన్నారు. రాష్ట్రంలో కరెంట్ కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. రూ. 50 వేల కోట్లు ఖర్చు చేసి రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేస్తున్నామన్నారు.
బీజీ బీజీగా గడిపిన మంత్రి
ఉదయం 10:30 గంటలకు చీర్లవంచ గ్రామంలో సబ్ స్టేషన్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన డా "బాబా సాహెబ్ అంబేడ్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలను ప్రారంభించి సభలో మాట్లాడారు. లక్ష్మిపూర్ లో హెల్త్ సబ్ సెంటర్ ను ప్రారంభించారు. పాపయ్యపల్లె గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం, గోపాల్రావుపల్లెలో అంబేడ్కర్ విగ్రహా ఆవిష్కరణ చేశారు. తంగళ్ల పల్లి పీహెచ్సీలో పిజియోథెరపీ సేవలను ప్రారంభించారు. గండిలచ్చపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్, సావిత్రి బాయ్ పులే, విగ్రహాలను ఆవిష్కరించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె ప్రగతి భవనాన్ని ప్రారంభించారు. గండిలచ్చపేట గ్రామంలో దళిత బంధు లబ్ధిదారులతో సహపంక్తి భోజనం చేసి సభలో మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, రాష్ట్ర పవర్‌లూం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.