తెలంగాణ ఉద్యమం గురించి మంత్రి కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదం: జీవన్ రెడ్డి

  • కేటీఆర్, కవిత ఇక్కడికి దిగుమతి అయ్యిన్రు: ఎమ్మెల్సీ జీవన్రెడ్డి 
  • తెలంగాణపై మేం ప్రాసెస్​ స్టార్ట్​ చేశాకే.. అమెరికా నుంచి ఇక్కడికొచ్చిన్రు: జీవన్రెడ్డి

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణ ఉద్యమం గురించి మంత్రి కేటీఆర్​ మాట్లాడుతుంటే నవ్వొస్తున్నదని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి అన్నారు. ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు కేటీఆర్ మాట్లాడుతున్నారని, తెలంగాణ ఉద్యమం టైంలో  కేటీఆర్​, కవిత ఎక్కడున్నారని ప్రశ్నించారు. 2004 టైంలో వాళ్లు అమెరికాలో ఉన్నారు. కాంగ్రెస్​ తెలంగాణ ప్రాసెస్​ను మొదలుపెట్టాకే ఇక్కడికి దిగుమతి అయ్యారని ఎద్దేవా చేశారు. 

ఫిషర్​మెన్​ కాంగ్రెస్​ సెల్​ చైర్మన్​ మెట్టు సాయితో కలిసి బుధవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. ఉద్యమం గురించి కేటీఆర్​కు అవగాహన లేదన్నారు. ‘‘అయ్యేది లేదు.. వచ్చేది లేదని తెలంగాణ ఏర్పాటుపై కేటీఆర్​ ఆనాడు కామెంట్​ చేశారు. ఇప్పుడేమో వాళ్ల వల్ల, వాళ్లు కొట్లాడడం వల్లే వచ్చిందని అంటున్నరు. ఏపీలో నష్టపోతామని తెలిసినా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.  

ALSO READ:ఉజ్వల స్కీమ్ కింద.. మరో 75 లక్షల కనెక్షన్లు

సిరిసిల్లలో పైసలు పంచను.. మందు పొయ్యను అని కేటీఆర్​ అంటున్నారు. అంత సత్యమంతులే అయితే మీ అభ్యర్థులందరితో తెలంగాణ తల్లి విగ్రహం మీద ప్రమాణం చేయించి అదే మాట చెప్పమనాలి’’ అని  డిమాండ్ ​చేశారు.  ‘‘గత బడ్జెట్​లో రూ.12 వేల కోట్లు ఇంటి నిర్మాణ పథకం కోసం పెట్టారు. ఆ పైసలు ఎటు పోయినయ్​. ఇప్పుడు నిర్మాణ ఖర్చులు రెట్టింపయ్యాక.. ఈ పథకానికి ఇచ్చే సాయాన్ని రూ.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు తగ్గించారు. 

దళితబంధును హుజూరాబాద్​కే పరిమితం చేశారు. క్యారీ ఫార్వర్డ్​ పేరిట రూ.40 వేల కోట్లను దుర్వినియోగం చేశారు. ఆ పథకం మీద ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు’’ అని మండిపడ్డారు. అమిత్ షా బెత్తం పట్టి ఎట్ల ఆడిస్తే అట్ల ఆడేటోళ్లు బీఆర్ఎస్​ నేతలు అని ఆయన విమర్శించారు.