హైదరాబాద్‌లో నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌తో పాటు పురపాలక శాఖ విభాగాల అధిపతులు మరియు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్‌లతో కలిసి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, మరియు డిప్యూటీ స్పీకర్ బాబాఫసియుద్దిన్ పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీలో ప్రస్తుతమున్న అధికారులంతా క్షేత్రపరిధిలోనే ఉండాలని ఆయన ఆదేశించారు. హైదరాబాద్ నగర మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, నగర ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ‘వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను.. స్థానికంగా ఉన్న ఫంక్షన్ హాల్, కమ్యూనిటీ హాల్‌లకు తరలించాలి. వారికి అక్కడే ఆహారంతో పాటు అవసరమైన దుప్పట్లు, వైద్య సదుపాయం కల్పించాలి. బస్తీ దావఖానాల్లో పనిచేస్తున్న డాక్టర్లతో పాటు ఇతర వైద్య సిబ్బంది అందరూ ఈ క్యాంపుల్లో పాల్గొనాలి. భారీ వర్షాలకు నగరంలో పెద్దఎత్తున చెట్లు మరియు విద్యుత్ పోల్స్ విరిగిపోయిన నేపథ్యంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు జీహెచ్ఎంసీ, విద్యుత్ సంస్థలు కలిసి సమన్వయంతో ముందుకువెళ్లాలి. హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండాయి. దాంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో మూసి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. నగర రోడ్ల పైన నిలిచిన నీటిని పంపించేందుకు ఓపెన్ చేసిన మ్యాన్ హోల్స్ వద్ద తగు సురక్షిత చర్యలు తీసుకోవాలి. ఓపెన్ నాలాల వద్ద ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకు స్థానిక మున్సిపల్ కమిషనర్లు, క్షేత్ర సిబ్బంది పర్యవేక్షణ చేయాలి. జీహెచ్ఎంసీ మరియు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాతావరణ శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలి. భారీ వర్షాల వలన ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పటికే అధికారులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం వైపు నుంచి అవసరమైన అన్ని సహాయక చర్యలను చేపడతాం. ఇండ్లు లేక రోడ్ల పైన ఉండేవారిని వెంటనే జీహెచ్ఎంసీ నైట్ షెల్టర్లకి తరలించాలి. భవనాలు నిర్మిస్తున్న ప్రాంతాలను తనిఖీ చేసి, సెల్లార్ తవ్వకాల వల్ల ప్రమాదాలు జరగకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు చూడాలి. కాలం చెల్లిన మరియు శిథిలావస్థకు చేరిన భవనాల నుంచి ప్రజలను వెంటనే బయటకు తీసుకు రావాలి. ఇందుకోసం అవసరమైతే పోలీస్ సహకారం తీసుకోవాలి. మరిన్ని భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో.. నేడు, రేపు ప్రైవేట్ సంస్థలు, ఆఫీసులు మూసేయాలి. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దు’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.
For More News..