
హనుమకొండ/వరంగల్, వెలుగు : మంత్రి కేటీఆర్ శనివారం(జూన్ 17) వరంగల్‌లో పర్యటించడంతో పోలీసులు శుక్రవారం రాత్రి నుంచే హల్‌చల్ చేశారు. వరంగల్‌లో బీజేపీ నేతలు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, కుసుమ సతీశ్, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డితో పాటు, కాకతీయ యూనివర్సిటీకి చెందిన ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‍యూ, ఏఐఎస్‍ఎఫ్, ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. బీజేపీ లీడర్ బైరి శ్యాం ఇంటి వద్ద పోలీసులు అర్ధరాత్రి ఒంటి గంటకు హంగామా సృష్టించారు.
శ్యాం ఇంటికి వెళ్లిన పోలీసులు అతడిని స్టేషన్‌కు రావాలంటూ బెదిరించారు. తన ఆరోగ్యం బాగా లేదు, ఇంట్లో ఒక్కదాన్నే ఉండలేనని శ్యాం భార్య పోలీసులను కోరినా వారు పట్టించుకోలేదు. పోలీసులు బలవంతంగా ఇంట్లోకి రావడంతో శ్యాం భార్య స్పృహ తప్పి పడిపోయింది. కాంగ్రెస్ చేనేత విభాగం రాష్ట్ర నేత చిప్ప వెంకటేశ్వర్లును సైతం అరెస్ట్ చేసి రాత్రంతా స్టేషన్‌లోనే ఉంచారు. డీసీసీ ప్రెసిడెంట్ రాజేందర్ రెడ్డి అరెస్ట్‌ను నిరసిస్తూ కాంగ్రెస్ లీడర్లు హనుమకొండ కాంగ్రెస్ భవన్ జంక్షన్‌లో నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు.
ప్రతిపక్షాలపై దాడులు ప్రజాస్వామ్యానికి చేటు
ప్రతిపక్షాలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు అన్నారు. హౌజ్ అరెస్ట్ చేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు బీఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న లీడర్లపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గం అని మండిపడ్డారు. వరంగల్ నగరానికి ఏటా రూ. 300 కోట్లు ఇస్తానని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ అరెస్ట్‌లతో ప్రజా ఉద్యమాలను ఆపలేరన్నారు. ప్రతిపక్షాలు, ప్రజలకు సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పారిపోతోందన్నారు. ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకే పోలీసులను వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జర్నలిస్టులపైనా దాడి
వరంగల్‌లో మంత్రి కేటీఆర్ టూర్ కవరేజీ కోసం వెళ్లిన జర్నలిస్టుల పట్ల కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రారంభోత్సవం వద్ద మిల్స్ కాలనీ కాలనీ సీఐ ముష్క శ్రీనివాస్ ‘మీడియా, గీడియా ఏం లేదు’ అంటూ జర్నలిస్టులను నెట్టివేశారు. కొత్తవాడ జంక్షన్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ వద్ద సైతం కవరేజీ కోసం వచ్చిన జర్నలిస్టుల గొంతులపై చేతులు వేస్తూ తోసేశారు. ఎస్సై భాను ప్రసాద్ తన సిబ్బందితో కలిసి వీడియో జర్నలిస్టులపై జులుం ప్రదర్శించాడు.
దీనిని రికార్డు చేసేందుకు ప్రయత్నించిన జర్నలిస్టుల చేతుల్లోని ఫోన్లను లాగేసుకున్నారు. కాగా జర్నలిస్టులపై దాడిని జర్నలిస్ట్ సంఘాల నేతలు ఖండించారు. వీడియో జర్నలిస్ట్‌పై దాడి చేసిన ఎస్సై భానుప్రసాద్‌ను సస్పెండ్ చేయాలంటూ గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారపు సదయ్య, ట్రెజరర్ అమర్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
వరంగల్ నగర పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ మొత్తం రూ.1,745.83 కోట్ల విలువైన వివిధ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఉదయం 10 గంటల శాయంపేటలోని మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు చేరుకున్న కేటీఆర్ యంగ్ వన్ కంపెనీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వరంగల్ ఓ సిటీలో ఈస్ట్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ను ప్రారంభించిన అనంతరం వరంగల్ జిల్లా కలెక్టరేట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు దేశాయిపేటలో నిర్మించిన డబుల్ ఇండ్లను ప్రారంభించి, డిస్ట్రిక్ట్ వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అలాగే 16 స్మార్ట్ రోడ్లు, మోడ్రన్ బస్టాండ్, ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు, ఉర్సు ఎస్‌టీపీ, రంగలీల మైదానంలో వాటర్ సప్లై ప్రాజెక్ట్, కుడా కల్చర్ సెంటర్, ఖిలా వరంగల్‌లో లైటింగ్ సిస్టం వంటి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. ఆయన వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీప్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు నరేందర్, అరూరి రమేశ్, కుడా చైర్మన్ సుందర్ రాజ్‌యాదవ్, మేయర్ గుండు సుధారాణి ఉన్నారు. అనంతరం వరంగల్ జిల్లాలోని రెండు జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలకు భూముల కేటాయింపునకు సంబంధించి అకౌంట్ నంబర్ ఇవ్వాలని, సొసైటీలో లేని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే 143 నేతలు లెనిన్, కక్కెర్ల అనిల్‌కుమార్‌గౌడ్, తుమ్మ శ్రీధర్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్, మెండు రవీందర్, చిలుముల సుధాకర్, వెంకన్న మంత్రి కేటీఆర్‌ను కోరారు.
ధర్మారెడ్డికి కన్ఫర్మ్... నరేందర్‌కు సస్పెన్స్
కేటీఆర్ తన వరంగల్ పర్యటనలో పరకాల ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేయగా, వరంగల్ తూర్పు విషయాన్ని సస్పెన్స్‌లో పెట్టారు. మెగా టెక్స్‌టైల్ పార్క్ వద్ద నిర్వహించిన మీటింగ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై పోటీ చేయడానికి పెద్ద పెద్ద లీడర్లే భయపడి వేరే నియోజకవర్గానికి పారిపోతున్నారని, ధర్మారెడ్డిని మరోసారి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సాయంత్రం వరంగల్ తూర్పులో జరిగిన మీటింగ్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ బాగా పనిచేస్తున్నాడని అంటూనే ‘సీఎం కేసీఆర్ ఆశీర్వాదం.. మీ దయ ఉంటే మంచి మెజార్టీతో మళ్లీ గెలిచి రావాలి’ అని ఆకాంక్షించారు. దీంతో ధర్మారెడ్డి విషయంలో ఇచ్చిన క్లారిటీ నరేందర్ విషయంలో ఇవ్వకపోవడంతో వచ్చే ఎన్నికల్లో నరేందర్‌కు టికెట్ డౌటే అని లీడర్లు అభిప్రాయపడుతున్నారు.