రాబందులు రావాలా.. రైతు బంధు కావాలా: మంత్రి కేటీఆర్

కామారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీవి నీతి లేని మాటలని.. రాబందులు రావాలా.. రైతు బంధు కావాలా మీరు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ కుంభకోణాలే జరుగుతాయని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో దుర్భిక్షం.. బీఆర్ఎస్ పాలనలో సస్యశ్యామలం కనిపిస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు.

కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.45 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఆగస్టు 14 సోమవారం అయన రోడ్లు, భవనాల శాఖా మంత్రి వేముల వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి కామారెడ్డి జిల్లా కేంద్రంలో రూ.28 కోట్లతో నిర్మించిన ఆరు లైన్ ల రహదారి, స్వాగత తోరణం, సెంట్రల్ లైటింగ్, మీడియన్, రోడ్డు డివైడర్లను ప్రారంభించారు.

సీఎం కేసీఆర్ సహకారంతో.. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కామారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. దాదాపు రూ. 28 కోట్లతో సెంట్రల్ లైటింగ్, ఆరు వరుసల రోడ్డు, స్వాగత‌ తోరణం, సెంట్రల్ మీడియన్ ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని పేర్కొన్నారు.నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి కోసం రూ. 25 కోట్లు మంజూరు చేయాలని గంప గోవర్ధన్, సీఎం కేసీఆర్‌ను కోరగా, రూ. 25 కోట్లు మంజూరు చేస్తూ ఈ రోజే(ఆగస్టు 14) ఉత్తర్వులు జారీ చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.