ఖమ్మం, వెలుగు: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఖమ్మం సిటీలో పర్యటించనున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ తో కలిసి రూ.1,369.36 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధానంగా మున్నేరు నదికి రెండు వైపులా రూ.690 కోట్లతో నిర్మించనున్న ఆర్సీసీ ప్రొటెక్షన్ వాల్ కు, మున్నేరు నదిపై రూ.180 కోట్లతో నిర్మించనున్న కేబుల్బ్రిడ్జికి శంకుస్థాపన చేయనున్నారు.
రూ.250 కోట్లతో అమృత్ 2.0 పథకం కింద చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేస్తారు. రూ.108 కోట్లతో నిర్మించిన గోల్లపాడు చానల్, పార్కును, రూ.8.5 కోట్లతో వీడీవోస్ కాలనీలో నిర్మించిన వెజ్ , నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను ప్రారంభించనున్నారు. తర్వాత ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో నిర్వహించే ప్రగతి నివేదన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్పాల్గొంటారు.