జీఎస్టీతో కేంద్ర ప్రభుత్వం నేతలన్నల నడ్డివిరుస్తోందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో రైతు బీమా మాదిరిగానే చేనేతలకు బీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్అన్నారు. సీఎం కేసీఆర్పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకువెళ్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. నేతన్నలకు చేయూతనిచ్చేందుకు అనేక పథకాలు తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేపట్టారు. ఇందులో భాగంగా సాయిని భరత్ ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ యూనిట్ ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. పోచంపల్లిలోని ప్రధాన రహదారిపై పోలీస్‌స్టేషన్ వద్ద పద్మశాలీ మహాజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతోపాటు సమీకృత వెజ్, నాన్ వెజ్ మారెట్, ధోబీ ఘాట్, మురుగు కాల్వలు, సీసీ రోడ్ల శంకుస్థాపన చేశారు.
దివాలా తీసిన పోచంపల్లి చేనేత పార్కును ప్రభుత్వం కొనుగోలు చేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.ఈ క్రమంలోనే పోచంపల్లి చేనేత పార్క్ ను పునరుద్ధరించి నేతన్నలకు ఉపాధి కల్పించాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు. నేతన్నలను బీమాతో ఆదుకుంటామన్న కేటీఆర్ 75 ఏళ్ల వయసు వరకు నేతన్న బీమా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రూ. 40 కోట్లతో కొత్త మగ్గాలను కొనుగోలు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.