- నిర్మల్‌జిల్లాలో పెద్దఎత్తున శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
నిర్మల్, వెలుగు : నిర్మల్ జిల్లాలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి నిర్మల్ నియోజకవర్గంలో బుధవారం పర్యటించి, పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మొదట దిలావర్పూర్ మండలం గుండంపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న కేటీఆర్ కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అదనపు కలెక్టర్ కిషోర్ స్వాగతం పలికారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గుండంపెల్లి వద్ద రూ. 714 కోట్లతో నిర్మించిన ప్యాకేజీ నంబర్ -27 (శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల పథకం)ని కేటీఆర్ ప్రారంభించారు.
స్విచ్ ఆన్ చేసి కాలువలకు నీటిని విడుదల చేశారు. ఆ తర్వాత దిలావర్పూర్ శివారులోని మాటేగాం వద్ద డెలివరీ సిస్టర్న్‌ను ప్రారంభించి కాలువ నీటికి పుష్పాభిషేకం చేశారు. అనంతరం సోన్ మండలం పాత పోచం పహాడ్ వద్ద రూ.300 కోట్లతో ఆయిల్ పామ్ ప్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ దేశంలో జనాభా పెరుగుదలకు అనుగుణంగా వంట నూనెల ఉత్పత్తి పెరగకపోవడం వల్ల ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్నారు. అయిల్ పామ్ ఫ్యాక్టరీ ఇక్కడే ఏర్పాటు చేస్తే ఇతర ప్రాంతాలకు మనమే ఎగుమతి చేయవచ్చన్నారు. చుట్టుపక్కల గ్రామాల నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే ఇది సాధ్యమైందన్నారు.
శిలాఫలకాల ఆవిష్కరణ
ఆ తర్వాత నిర్మల్‌కు చేరుకొని రూ.10 కోట్లతో నిర్మించనున్న సమీకృత మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా పట్టణంలో మంచినీటి వ్యవస్థను మెరుగుపరిచేందుకు రూ.39.91 కోట్ల వ్యయంతో పూర్తిచేసిన పనులను ప్రారంభించారు. మరికొన్ని అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను మంత్రి ఆవిష్కరించారు. రూ.2 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో నిర్మించే దోబీఘాట్ పనులు, రూ.4 కోట్ల నిధులతో మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టే పలు అభివృద్ధి పనులకు, మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు అమృత పథకంలో భాగంగా రూ.62.5 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు.
రూ.50 కోట్లతో నిర్మల్ పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.1,157 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సభకు భారీ సంఖ్యలో జనం తరలిరావడంతో నిర్మల్ పట్టణమంతా కిక్కిరిసిపోయింది. ట్రాఫిక్‌ను అదుపు చేసేందుకు వాహనాలను ఇతర రూట్లలో మళ్లించారు.
ప్రజల అభిప్రాయం మేరకే నిర్మల్ టౌన్ ప్లానింగ్
నిర్మల్ పట్టణం రోజురోజుకు విస్తరిస్తున్న కారణంగా కొత్త మాస్టర్ ప్లాన్ అవసరమేనని, అయితే ప్రజలందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ మాస్టర్ ప్లాన్‌ను అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్ పై స్థానికులకు హామీ నివ్వాలంటూ కేటీఆర్‌కు ఇంద్రకరణ్ రెడ్డి సూచించగా.. మాస్టర్ ప్లాన్ విషయంలో ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, రైతులు, స్థానిక ప్రజలందరి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే కొత్త మాస్టర్ ప్లాన్ అమలవుతుందని హామీ ఇచ్చారు.
దీనికి ముందు ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ కొంతమంది రాజకీయంగా లబ్ధి పొందేందుకే మాస్టర్ ప్లాన్ విషయంలో ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మాస్టర్ ప్లాన్ పేరిట రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఇంట్లో కూర్చొని దొంగ నిరాహార దీక్షలు చేశారని విమర్శించారు.