ప్రతిపక్షాలకు పని, పాట లేదు..ప్రజలెవరూ ఆగం కావొద్దు : మంత్రి కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. ప్రతిపక్షాలకు పని, పాట లేదని, రెండు అంశాలు పట్టుకుని తిరుగుతారని ఆరోపించారు. తాను కారులో వెళ్తుంటే.. కొంతమంది అడ్డుపడుతున్నారని, డ్రామాలు చేయవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కంటే 55 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్న వాళ్లు ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ‘‘విద్యతోనే వికాసం...ఆనందం.. -బాగా చదువుకుంటే ఎవరి పైరవీలు అవసరం లేదు. ఒక్కతరం చదువుకుంటే ఆ కుటుంబం ఎప్పటికీ బాగుంటుంది. వ్యవస్థలో లోపాలు ఎప్పటికీ ఉంటాయి. అన్నింటినీ భూతద్దంలో చూడొద్దు’’ అని వ్యాఖ్యానించారు. 

సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం మన బడి ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఆనాడు కరెంట్ ఎలా ఉండే, సాగునీరు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందన్నారు. ప్రభుత్వం ఆలోచన, చిత్తశుద్ధి ఎలా ఉందనేదే ముఖ్యమన్నారు. 3 వేల 416 తండాలను తాము గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దామన్నారు. ఉచిత కరెంట్, రైతుబీమా, రైతుబంధు తొమ్మిదేళ్ల క్రితం ఉన్నాయా..? అని ప్రశ్నించారు. ప్రజలెవరూ ఆగం కావద్దని, ఎవరో వచ్చి ఉపన్యాసాలు ఇవ్వగానే తొందర పడవద్దని చెప్పారు.

తాము ఖర్చు పెట్టే డబ్బులు ప్రజలదేని, తమ పైసలు కాదని, అందుకే చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్. ‘‘నేను కారులో వస్తుంటే ఇద్దరు, ముగ్గురు పొరగల్లు వచ్చి అడ్డం వస్తారు. ఏమవుతుంది. డ్రామాలు వద్దు. మా కంటే 55 ఏళ్ల నుంచి ఉన్నవారు ఏం చేశారు. మా లెక్క ప్రకారం మేము ముందుకుపోతాము. ఇక్కడి ఎంపీ (కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ) అర పైసా ఖర్చు చేశాడా. మేము ఒక్కబడి కడితే.. మీరు రెండు కట్టమనండి మీ ఎంపీకి చేతనైతే. కొంతమంది పోలీసులను అడ్డం పెట్టుకుంటున్నారు. నేను మాత్రం పోలీసులను అడ్డు పెట్టుకొను. నేను ప్రజల మధ్యలో ఉండే వాడిని. నాకు ప్రజలు ముఖ్యం. ప్రజలు దయ తలిస్తే మళ్లీ ఎమ్మెల్యేగా సేవ చేస్తాను’’ అని వ్యాఖ్యానించారు. 

తెలంగాణ రాష్ట్రంలో 26 వేల పాఠశాలను విడుతల వారీగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు. అన్ని రంగాల్లోనూ సిరిసిల్ల జిల్లా ముందంజలో ఉందన్నారు. విద్యలోనూ జిల్లా అగ్రగామిగా నిలబడాలన్నారు. విద్యార్థుల్లో కులం, మతం అనే భావన రావొద్దని సూచించారు. విద్య అంశం ఒక్కటే కాదని, సమాజంపై పాఠ్యాంశాలు చేర్చాలని అభిప్రాయపడ్డారు. బాలికల కోసం సెల్ఫ్ డిఫెన్స్ అనేది అన్ని పాఠశాలలోనూ ఏర్పాటు చేయాలన్నారు. 

https://twitter.com/MinisterKTR/status/1671053337356292096