
- సైబర్ సేఫ్టీ ఆఫీసు ప్రారంభోత్సవంలో మంత్రి కామెంట్లు
కొంతమంది పోలీసులు యూనిఫామ్‌ను దుర్వినియోగం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. పోలీస్ స్టేషన్‌కు రావాలంటే సామాన్య ప్రజలు ఇప్పటికీ భయపడుతున్నారని చెప్పారు.
హైదరాబాద్, వెలుగు: పోలీసులపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పోలీసులు యూనిఫామ్‌ను దుర్వినియోగం చేస్తున్నారని అన్నా రు. దీంతో పోలీస్ స్టేషన్‌కు రావాలంటే సామాన్య ప్రజలు ఇప్పటికీ భయపడుతున్నారని చెప్పారు. దీన్ని నివారించడానికి బాడీవార్న్ కెమెరాలను తప్పనిసరిగా ఉపయోగించాలని, కంట్రోల్ రూమ్ నుంచి తమను చూస్తున్నారనే భయం సిబ్బందిలో తీసుకురావాలని అన్నారు. రాష్ట్రంలో సైబర్ నేరాల నియంత్రణ కోసం సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్‌సీఎస్‌సీ), సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ(టీఎస్‌పీసీసీ) కార్యాలయాన్ని సైబరాబాద్ కమిషనరేట్ లో ఏర్పాటు చేశారు. దీన్ని శనివారం హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు.
టోల్ ఫ్రీ నంబర్ 1930పై అవగాహన కల్పించాలి..
మానవ జీవితంలో డిజిటల్ టెక్నాలజీ ఓ భాగమైందని కేటీఆర్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక టైమ్ లో ఓటర్ల అకౌంట్లలోకి డబ్బులు డైరెక్ట్‌గా రావడం చూశామన్నారు. టెక్నాలజీ డెవలప్ అయిన కొద్దీ ఐడీ థెఫ్ట్, ఐడెంటిటీ థెఫ్ట్ పెరిగిపోయిందని చెప్పారు. ‘‘కొన్ని రోజుల క్రితం నా ఫ్రెండ్ రూ.లక్ష మోసపోయానని చెప్పాడు. టోల్‌ఫ్రీ నంబర్1930 గురించి చాలా మందికి అవగాహన లేదు. ప్రజల్లో మరింత అవగాహన తీసుకురావాలి. టీఎస్‌పీసీసీ ద్వారా పోలీసులు, ఐటీ కంపెనీలు కలిసి సైబర్ నేరాల నియంత్రణకు కృషి చేయాలి” అని సూచించారు. నేరాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ఇంటర్నెట్, డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సైబర్ నేరాలు పెరిగిపోయాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు ఉన్నారని తెలిపారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో కేసులు రిజిస్టర్ చేయడం, నిందితులను అరెస్ట్ చేయడం ఒక్కటే సరిపోదు. ప్రజలు బాధితులుగా మారకుండా చర్యలు తీసుకోవాలి. అందుకోసం అన్ని విభాగాలతో కోఆర్డినేట్ చేసుకుంటూ పని చేయాలి” అని సూచించారు.
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో సిరిసిల్ల టాప్
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2022 నవంబర్ నెల లో 4 స్టార్ కేటగిరీలో సిరిసిల్ల జిల్లా మరోసారి దేశంలోనే ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఈ విషయాన్ని కేటీఆర్ శనివారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి అభినందనలు తెలిపారు. అన్ని ఇండ్లల్లో టాయి లెట్లు నిర్మించుకోవడం, గ్రామాల్లో తడి, పొడి చెత్త నిర్వహణ, కంపోస్ట్ షెడ్ల వినియోగం, అన్ని గ్రామాలను ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ కేటగిరీ కింద మోడల్ గ్రామాలుగా ప్రకటించడంతో జిల్లా దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిందన్నారు.