ఇటీవల మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో V6, వెలుగు వార్తా సంస్థపైన తన ఆక్రోశాన్ని వెళ్లగక్కడం ఆయన అసహనాన్ని తెలుపుతున్నది. V6, వెలుగు తెలంగాణ తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నాయి. ఉద్యమ కాలంలో ఆంధ్ర మీడియా అబద్దాలను, ఛేదించి తెలంగాణ గొంతుకైన వీ6ను బ్యాన్ చేస్తామనేందుకు ఆ మంత్రికి నోరెలా వచ్చింది? ప్రభుత్వ వైఫల్యాలను, సామాన్యుని బాధలను ముక్తకంఠంతో వీ6 ప్రశ్నిస్తున్నది. రాజకీయాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా ప్రజాపక్షమే తన లక్ష్యమన్నట్లు వార్తలు అందిస్తున్న వీ6, వెలుగు మాధ్యమాలను బ్యాన్ చేస్తామనే వారు.. తమను బ్యాన్ చేసే వారు ప్రజలనే విషయం మర్చిపోతున్నారు.
నాడు తెలంగాణ ఉద్యమాన్ని నడపడంలో, నేడు తెలంగాణ వచ్చాక ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంలో వీ6, వెలుగు ప్రజల మన్ననలు పొందుతూనే ఉన్నది. తెలంగాణ కట్టుబొట్టు, యాస, భాష, సంస్కృతిని ప్రతిబింబించేలా తీన్మార్ ప్రోగ్రాంతో వీ6 తెలంగాణ ప్రజల మన్ననలు చూరగొంది. ప్రతి ఏటా బతుకమ్మ పాటలను చిత్రీకరించి తెలంగాణ మారుమూల ప్రాంతాల ప్రజల మన్ననలు పొందింది. కానీ దురదృష్టవశాత్తు నేడు సొంత రాష్ట్రంలోనే బెదిరింపులకు గురి అవ్వడం చాలా బాధాకరం. V6 వెలుగు సంస్థల సీఈఓ అంకం రవి సార్ గారి లాంటి నిక్కచ్చి వ్యక్తి సారధ్యంలో వీ6 – వెలుగు అన్ని రాజకీయ పక్షాలకి సమాన విలువను, గౌరవాన్ని ఇస్తూ ఉంది.
ఈ సంస్థ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సామాన్యుని పక్షాన నిలిచింది తప్ప ఎప్పుడు కూడా వ్యక్తిగత దూషణలకు గానీ, వివాదాస్పద విషయాల జోలికిగాని వెళ్ళలేదు. రాష్ట్రం లోని అన్ని వార్తా సంస్థలు ప్రభుత్వ వైఫల్యాలను సూటిగా ప్రశ్నించలేకపోతున్నాయి. ఆ పని వీ6 చేయ గలుతున్నది. ప్రభుత్వ సొంత మీడియా మాత్రం కేంద్రాన్ని , ప్రతిపక్షాలను విమర్శించవచ్చు కానీ ఇతరులు రాష్ట్ర సమస్యలపైన ప్రశ్నించరాదు అన్నట్లు ఉంది మంత్రి గారి తీరు. మేదావులు, సీనియర్ పాత్రికేయులు మంత్రి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. సామాన్య ప్రజానీకం నిరసిస్తున్నారు. నెటిజన్లు కూడా ఆ మాటలపై మండిపడుతున్నారు.
- నేరడిగొండ సచిన్, ఉస్మానియా యూనివర్సిటీ