ఒక పదవిలో.. ఒక వ్యక్తి మూడుసార్లకు మించి ఉండకూడదు : లోకేష్ సంచలన వ్యాఖ్యలు

ఒక పదవిలో.. ఒక వ్యక్తి మూడుసార్లకు మించి ఉండకూడదు : లోకేష్ సంచలన వ్యాఖ్యలు

సోమవారం ( జనవరి 27, 2025 ) విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని.. ఒక కుటుంబంలో మూడు పదవులకు మించి ఉండకూడదని అన్నారు. ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు పర్యాయాలు మించి ఉండకూడదని అన్నారు లోకేష్. పార్టీ జాతీయ కార్యదర్శి పదవి నుండి తప్పుకుంటానని, ఒకే పదవి ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. డిప్యూటీ సీఎం పదవి ఊహాగానాలు మాత్రమేనని.. మంత్రిగానే కొనసాగుతానని అన్నారు లోకేష్.

పార్టీలో అందరికీ అన్ని అవకాశాలు రావాలన్నదే తన అభిప్రాయమని అన్నారు లోకేష్. అయితే.. ఇటీవల లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న వాదనను టీడీపీ క్యాడర్ లేవనెత్తిన క్రమంలో లోకేష్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.టీడీపీలో చంద్రబాబు తర్వాత అంతటి సమర్థుడు లోకేష్ అని.. పార్టీలో మూడో తరం నాయకుడైన లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే యుతరానికి రాజకీయాలపై నమ్మకం ఉంటుందని కడప జిల్లా టీడీపీ నాయకుడు శ్రీనివాస రెడ్డి ఓ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు సమక్షంలోనే మాట్లాడటం, దావోస్ పర్యటనలో ఎమ్మెల్యే టీజీ భరత్ కూడా కాబోయే సీఎం లోకేష్ అంటూ చంద్రబాబు సమక్షంలోనే మాట్లాడటం చర్చనీయాంశం అయ్యింది.

Also Read:-రఘురామకు షాక్.. జగన్ బెయిల్ రద్దు పిటీషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు..

టీడీపీ క్యాడర్ లేవనెత్తిన ఈ వాదనతో సోషల్ మీడియాలో జనసేన, టీడీపీ మధ్య మాటల యుద్ధం రాజేసింది. లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే.. పవన్ కళ్యాణ్ కు సీఎం పదవి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు జానసైనికులు ఈ క్రమంలో ఇరు పార్టీల అధిష్టానాలు కలుగజేసుకొని.. క్యాడర్ కి వార్నింగ్ ఇవ్వటంతో వివాదం సద్దుమనిగింది. అయితే.. లోకేష్ తాజా వ్యాఖ్యలతో నెక్స్ట్ సీఎం  ఎవరన్న చర్చ మొదలవుతుందా.. లోకేష్ వ్యాఖ్యలు పార్టీలో ఏ పరిణామాలకు దారి తీస్తాయో వేచి చూడాలి.