
పోలవరం కట్టే సత్తా సీఎం కేసీఆర్ కే ఉందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని మల్లారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మల్లారెడ్డి.. బీఆర్ఎస్ కు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. రాష్ట్ర విభజన జరిగిన ఎనిమిదేళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఏపీలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ఏపీలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఎలాగైతే పూర్తి చేశారో.. అదే తరహాలో పోలవరాన్ని త్వరగా పూర్తి చేస్తారని మల్లారెడ్డి చెప్పారు.
కేసీఆర్‌పై వివిధ రాష్ట్రాల ప్రజలకు సమ్మకం వచ్చిందని మల్లారెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. ఏపీకి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని అన్నారు. తెలంగాణ తరహాలో ఏపీ ప్రజలకు సంక్షేమ పథకాలుల అందిస్తామన్నారు.