రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ : మంత్రి మల్లారెడ్డి విమర్శలు

  • రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్
  • కాంగ్రెస్ దొంగల పార్టీ మంత్రి మల్లారెడ్డి విమర్శలు 

మేడిపల్లి, వెలుగు : కాంగ్రెస్ దొంగల పార్టీ అని, రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ అని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ఓపెనింగ్ కార్య క్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత  కేసీఆర్ దేనన్నారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అమలు చేసే సత్తా కాంగ్రెస్, బీజేపీలకు ఉందా అని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి, వజ్రేశ్ యాదవ్, సుధీర్ రెడ్డి ముగ్గురూ దొంగలని, వారిని ప్రజలు ఏమాత్రం నమ్మరని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్ యాదవ్ బోడుప్పల్​లోనే మూడెకరాల పేదల ఇళ్ల స్థలాలను కబ్జా చేసుకున్నారని ఆరోపించారు. ప్రతి పక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా  మళ్లీ బీఆర్ఎస్ గెలవడం ఖాయమన్నారు. 
 
మళ్లా భారీ మెజార్టీతో గెలుస్త

పేద ప్రజల కోసం కేసీఆర్ మేనిఫెస్టో రూపొందించారని మల్లారెడ్డి పేర్కొన్నారు. తాను మేడ్చల్ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుస్తున్నానని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని, కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా దక్కవని స్పష్టం చేశారు. కేసీఆర్ నేతృత్వంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పడటం తథ్యమని వెల్లడించారు. మోసపూరిత మాటలతో ప్రజలముందుకు వస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు తగని బుద్ధి చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు.