హైదరాబాద్: తమ బంధువుల ఇంట్లో జరిగిన ఓ విందులో చుట్టాలకు మందు పోశానని, అందులో తప్పేముందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. మునుగోడు ఓటర్లకు మందు పోసి.. వాళ్లను ప్రలోభపెట్టేందుకు మంత్రి మల్లారెడ్డి ప్రయత్నించారంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తా కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఓటర్లకు మందు పోసి ప్రలోభపెట్టాల్సిన ఖర్మ తమకు లేదని, మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. తాను ఓటర్లకు మందు పోయలేదని, తమ బంధువులకు మాత్రమే పోశానని తెలిపారు. తన బావ ఇంట్లో ఫంక్షన్ ఉందంటే వెళ్లానని, అక్కడ తెలిసిన చుట్టాలకు మందు సర్వ్ చేశానని స్పష్టం చేశారు.
ఓ మంత్రిగా ఉండి అలా మందు పోయొచ్చా అని తనను ట్రోల్ చేస్తున్నారని, తనకు పర్సనల్ లైఫ్ ఉండదా అని మంత్రి ప్రశ్నించారు. ‘‘నాపై ఆరోపణలు చేస్తున్నవాళ్లు వాళ్ల ఇళ్లల్లో మందు తాగడం లేదా? వాళ్ల ఫోటోలను ఇలాగే మీడియాలో వైరల్ చేస్తున్నారా?’’ అంటూ మల్లారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తాను బయట మాత్రమే మంత్రినని, ఇంట్లో తనకు పర్సనల్ జీవితం ఉంటుందని చెప్పారు. అయినా తానేమైనా పబ్లిక్ లో మందు పోశానా అంటూ మంత్రి ప్రశ్నించారు.
రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ తీసుకోలేదా?
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ ప్రభుత్వం నుంచి రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ పొందలేదా అని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. స్వయంగా రాజగోపాల్ రెడ్డే తాను బీజేపీ నుంచి కాంట్రాక్ట్ తీసుకున్నాని చెప్పారని అన్నారు. రాజగోపాల్ రెడ్డి స్వార్ధం వల్లే ఇవాళ మునుగోడు ఎన్నికలు వచ్చాయి తప్ప మరేం కాదన్నారు. ఉప ఎన్నికల పేరుతో సీఎం కేసీఆర్ ను ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ నాయకులు రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించారని ఆరోపించారు.