బీజేపీ అధికారంలోకొస్తే మోటార్లకు మీటర్లు పెడ్తరు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దమ్ముంటే కేంద్ర నిధులు తెచ్చి మునుగోడును అభివృద్ధి చేయాలని మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ వస్తే మోటార్లకు మీటర్లు బిగిస్తారన్న మంత్రి.. సీఎం కేసీఆర్ గొంతులో ప్రాణం ఉన్నంతవరకు మోటార్లకు మీటర్లు పెట్టనియ్యరన్నారు. కాంగ్రెస్ దేశంలో దివాలా తీసిందని.. కాంగ్రెస్ది జోడోయాత్ర కాదని.. చోడో యాత్ర అని విమర్శించారు. దసరా రోజు పాండవులు జమ్మికి వెళ్లి కౌరవులపై యుద్ధం ప్రకటించినట్టు.. బీజేపీతో యుద్ధానికి జాతీయ పార్టీని ప్రకటించాడని తెలిపారు.

తెలంగాణను అన్నపూర్ణ రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెం, కాట్రేవు, గుండ్లబావి గ్రామాలకు తనను ఇంచార్జ్ గా నియమించినట్లు తెలిపారు. కాట్రేవు గ్రామంలో మహిళలందరూ టీఆర్ఎస్ కే ఓటేస్తామని శపథం చేశారని చెప్పారు. కరోనా కష్టకాలంలో కూడా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆపలేదన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డులు పెడుతుండడం కేసీఆర్ పాలనకు నిదర్శనమన్నారు. దళితులు ఆత్మగౌరవంతో బతకాలన్న ఉద్ధేశ్యంతో దళితబంధు పెట్టారని చెప్పారు