మీడియా ప్రతినిధులకు మంత్రి మల్లారెడ్డి వార్నింగ్

  • ఫొటోలు తీస్తుంటే ఫోన్లు లాక్కున్న అనుచరులు 
  • పానం బాగాలేదని సాయం చేయమన్న మహిళతో కామెడీ
  • తన కొడుక్కు ఉద్యోగం రాలేదని ఓటెయ్యనన్న మరో మహిళ

యాదాద్రి, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధులపై అసహనం వ్యక్తం చేశారు. 'నేను మల్లారెడ్డిని.. నా తడాఖా చూపించే పోతా' అని వేలు చూపిస్తూ వెళ్లారు. మునుగోడు ఉప ఎన్నికల్లో యాదాద్రి జిల్లా చౌటుప్పల్​ మండలం అరెగూడెం, కాట్రేవు గ్రామాలకు మంత్రి మల్లారెడ్డి ఇన్​చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా అరెగూడెం వచ్చిన మంత్రి .. కుల సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. మొదట కాటమయ్య గుడి నిర్మాణం కోసం రూ. 12 లక్షల విరాళం ప్రకటించి, రూ. 2 లక్షల నగదు ఇచ్చారు. మిగిలిన డబ్బు తొందరలోనే ఇస్తానని చెప్పారు. తర్వాత ఈరమ్మ గుడి గురించి మాట్లాడుతుండగా అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. ఇది గమనించిన మంత్రి వెంట వచ్చిన ఆయన అనుచరులు ఫోన్లు లాక్కున్నారు. దీంతో మంత్రి అనుచరులతో మీడియా ప్రతినిధులు వాగ్వాదానికి దిగారు. మంత్రి మల్లారెడ్డి కూడా 'నేను పైసల గురించి మాట్లాడుతుంటే వీడియోలు తీశారు. ఆ డబ్బులు ఏదో మీరే ఇవ్వండి' అంటూ మాట్లాడారు. పైగా కులసంఘాల ప్రతినిధులతో ‘మీకు పైసలిస్తుంటే ఈళ్లు(మీడియా ప్రతనిధులు) అడ్డుకుంటున్నారు’ అని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటికి కాట్రేవుకు చేరుకున్న మల్లారెడ్డి ప్రచారం చేసి తిరిగి వెళ్లడానికి కారెక్కుతూ 'నేను మల్లారెడ్డిని నా తడఖా చూపించే పోతా’ అంటూ వేలు చూపిస్తూ కామెంట్​ చేశారు. 

ఓటు ఎందుకు వేయాలి?
కాట్రేవులోనే ఓటు వేయాలంటూ వచ్చిన మంత్రి మల్లారెడ్డిని ఓ ముసలామే ఖంగు తినిపించింది. 'నా కొడుకు తెలంగాణ ఉద్యమంలో తిరిగిండు. 18 వరకు చదువుకుండు. ఇప్పటి వరకూ ఉద్యోగం రాలే. ఉద్యోగం ఇవ్వని మీకు ఓటు ఎందుకు వేయాలి' అంటూ ప్రశ్నించారు. దీంతో ఖంగుతిన్న మంత్రి ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.  

రెండు కార్లలో పైసలు తీసుకపో.. 
కాట్రేవులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి మల్లారెడ్డి వద్దకు ఓ మహిళ వచ్చి.. 'పానం బాగలేక దవాఖాన్ల చుట్టూ తిరుగుతున్న. మస్తు పైసలు అయితున్నయి. సాయం చేయండి' అంటూ కోరారు. దీంతో 'మా ఇంట్ల మస్తుగా పైసలున్నయి. రెండు కార్లు తీసుకొచ్చి నింపుకొని పో' అంటూ రిప్లయ్​ ఇచ్చారు. మంత్రి మాటలు విన్న ఆమె తెల్లమొహం వేశారు. అంతకు ముందు మంత్రి 'నాకు కరోనా వచ్చి పోయింతర్వాత అన్ని మరిచిపోతున్న. పైసలు ఎక్కడ పెట్టానో కూడ మరిచిపోతున్న. నీకు గుర్తుంటున్నాదే' అంటూ ఓ ముసలాయనను ప్రశ్నించారు.