- కంపెనీ వాళ్లు టూర్కు పోయిన్రు !
- పనులపై ప్రశ్నించిన జనాలకు మంత్రి మల్లారెడ్డి సమాధానం
- వృద్ధులను బస్సుల్లో హెల్త్ క్యాంపు కు తరలించిన మినిస్టర్
- కవరేజీకి వెళ్లిన మీడియాను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు
యాదాద్రి, వెలుగు: ‘సార్ కంపెనీతో మాట్లాడి అభివృద్ధి పనులు చేయిస్తనన్నరు కదా? ఏమైంది? అని ప్రశ్నించిన జనాలకు మంత్రి మల్లారెడ్డి షాకింగ్ సమాధానం ఇచ్చారు. ‘వాళ్లంతా టూర్లో ఉన్నరు. వచ్చిన తర్వాత చేయిస్తలే’ అని చెప్పడంతో బిత్తరపోయారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్మండలం ఆరెగూడెం ఇన్చార్జిగా మంత్రి మల్లారెడ్డి కొనసాగుతున్నారు. కొద్దిరోజులుగా ఆయన ఇక్కడ ప్రచారం చేస్తూ స్థానికులకు హామీలిస్తున్నారు. మూడు రోజుల కింద దివీస్ కంపెనీ మేనేజ్మెంట్ తో మాట్లాడి అభివృద్ధి పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు. దీంతో బుధవారం పనుల కోసం యాజమాన్యాన్ని పిలిపించాలని కోరగా, వాళ్లు టూర్కు వెళ్లారని, వచ్చిన తర్వాత మాట్లాడుతానని మినిస్టర్ రిప్లై ఇచ్చారు.
హాస్పిటల్ కు తరలింపు
తాను ఇన్చార్జిగా ఉన్న గ్రామాలకు చెందిన పలువురిని మంత్రి.. హైదరాబాద్ లోని తన హాస్పిటల్లో హెల్త్ చెకప్‌కు పంపించారు. ప్రచారంలో భాగంగా తనను కలిసిన వృద్ధులకు ఫ్రీగా హెల్త్చెకప్ చేయిస్తానని చెబుతూ వస్తున్నారు. బుధవారం అందరినీ బస్సుల్లో హైదరాబాద్ పంపించారు.
మిగిలిన మొత్తం ఎన్నికల తర్వాతే?
కమ్యూనిటీ బిల్డింగ్స్ కోసం తాను ఇస్తానన్న డబ్బులను ఎన్నికల తర్వాతే ఇస్తానని మంత్రి స్పష్టం చేశారు. ఆరెగూడెంలో గౌడ కులస్తులతో మీటింగ్నిర్వహించారు. రెండ్రోజుల క్రితం ఇచ్చిన హామీ ప్రకారం గౌడ కమ్యూనిటీ బిల్డింగ్‌కు ఇస్తానన్న రూ. 12 లక్షల్లో బుధవారం కొంత మొత్తం ఇచ్చారని, మిగిలినవి ఎన్నికల తర్వాత ఇస్తామని చెప్పినట్టు తెలిసింది. వడ్డెర కులానికి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని సమాచారం.
మీ కవరేజీ అవసరం లేదు
గౌడ కులస్తులతో మంత్రి మీటింగ్ సందర్భంగా కవరేజీకి వెళ్లిన 'వీ 6, వెలుగు' రిపోర్టర్లకు వ్యతిరేకంగా 'గో బ్యాక్' అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. మంత్రి ఫండ్స్ఇవ్వడానికి వస్తుంటే వీ6, వెలుగు ఆయనను బద్నాం చేస్తున్నాయని, మీ కవరేజీ మాకు అవసరం లేదంటూ కామెంట్ చేశారు.
మంత్రి కారు తనిఖీ
మంత్రి మల్లారెడ్డి కారును కేంద్ర పోలీసు బలగాలు తనిఖీ చేశాయి. చౌటుప్పల్ మండలం గుండ్లబావిలో ప్రచారం నిర్వహించి ఆరెగూడెం వెళ్తుండగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కారును ఆపి తనిఖీ చేశారు.